గుజరాత్ రాజకీయాన్ని దేశం మొత్తానికి రుద్దాలని ప్రధాని మోదీ యత్నిస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. కేసీఆర్, జగన్ లతో కలసి మోడీ కుట్రలకు పాల్పడుతున్నారని గుంటూరులో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో గల్లా జయదేవ్ మండిపడ్డారు. వీరి ముగ్గురి దృష్టి ప్రస్తుతం తనపై పడిందని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తన ప్రసంగంతో మోదీని ప్రశ్నించినందకు ఈడీ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. పక్కాగా ట్యాక్సులు కడుతున్నా ఐటీ రైడ్స్ చేశారని మండిపడ్డారు. తప్పు చేసినట్టు తేలితే జైలుకు వెళ్లడానికి తాను సిద్ధమని గల్లా జయదేవ్ అన్నారు.
రాష్ట్ర విభజన ఎంత అన్యాయమో.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే జోన్ కూడా అంతేనని ఎంపీ గల్లా జయదేవ్ ధ్వజమెత్తారు. సరకు రవాణా ఆదాయం ఒడిశాలోని రాయగడకు, ప్రయాణికుల ఆదాయం విశాఖకు వచ్చేలా భాజపా కుట్ర చేసిందని మండిపడ్డారు. కేంద్రం ప్రకటించిన జోన్ వల్ల 70% ఆదాయం పక్క రాష్ట్రానికి పోతోందని, ఖర్చులు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు మిగులుతాయని పేర్కొన్నారు. శనివారం ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పి 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగిస్తున్నారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్న మోదీ ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగించడంపై ఏం చెబుతారు?
' ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న ఉద్దేశంతోనే ప్రధాని పర్యటనకు ఒక్కరోజు ముందు కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది. విభజన హామీలు ఎంతమేర అమలు చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తే... ప్రధాని సమాధానం చెప్పకుండా జారుకున్నారు.’ అని ధ్వజమెత్తారు. పాకిస్థాన్‌పై వైమానిక దాడులు రక్షణ మంత్రికి తెలుసా?: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో భారతసైన్యం చేసిన వైమానిక దాడుల గురించి దేశ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు కూడా తెలియనట్లుందని జయదేవ్ అన్నారు.‘కీలక నిర్ణయాల్ని మంత్రివర్గ సహచరులతో చర్చించకుండా ఏకపక్షంగా తీసుకుంటున్నారు. మోదీ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. మరోసారి మోదీ ప్రధాని అయితే అంతే?’ అని వ్యాఖ్యానించారు.