చిత్తూరు జిల్లాలో అమరరాజా కంపెనీపై , రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వేధింపులు గురించి, గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాలుష్యం పేరుతో అమరరాజా కంపెనీని టార్గెట్ చేసి, ఆ కంపెనీ మూసివేయాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. తరువాత కంపెనీ హైకోర్టుకు వెళ్లి, ఆ ఆదేశాలు నిలిపుదల చేసినా, ప్రభుత్వం నుంచి వస్తున్న వేధింపులు ఆగక పోవటంతో, ఆ కంపెనీ చెన్నై తరలి వెళ్ళిపోతుంది అంటూ, వార్తలు వచ్చాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రెడ్ కార్పెట్ పరిచారని, అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించారు అని, త్వరలోనే కంపెనీ తరలి వెళ్ళిపోతుంది అంటూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కలకలం రేగింది. దీనికి తోడు రాష్ట్ర ప్రధాన సలహదారుగా ఉన్న సజ్జల రామకృష్ణా రెడ్డి, వాళ్ళు వెళ్ళటం కాదు, మేమే గెంటేస్తున్నాం అని బహిరంగ ప్రకటన చేయటంతో, అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద పరిశ్రమ వెళ్లిపోతుంటే, ఇంత తేలికగా ఎలా ప్రకటన చేస్తారు అంటూ అందరూ ఆశ్చర్య పోయారు. అమరరాజా కంపెనీలో మొత్తం 18 వేల మంది వరకు పని ప్రత్యక్షంగా పని చేస్తున్నారు, అలాగే మరో 50 వేల మంది వరకు పరోక్షంగా పని చేస్తున్నారు. ఇంత మంది వెళ్లిపోతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇంత సింపిల్ గా ఎలా చెప్తుంది అనేది అర్ధం కాలేదు.
అయితే ఈ ఘటన పై అమరరాజా కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఈ విషయం కోర్టులో కూడా ఉంది. దీంతో నిన్న అమరరాజా కంపెనీకి చెందిన వారు ఎవరూ ఈ అంశం పై స్పందించలేదు. అయితే నిన్న అమరరాజ కంపెనీ చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు, అలాగే గల్లా జయదేవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు బాధ్యతలు నుంచి తప్పుకుంటున్న క్రమంలో, ప్రెస్ మీట్ పెట్టి, తన ప్రస్థానం గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో విలేఖరులు చెన్నై తరిలి వెళ్లిపోతున్నారా అని అడగగా, దాన్ని ఖండించలేదు కానీ, భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఏమి చెప్పగలం, పరిస్థితిని బట్టి సంస్థను కాపాడే నిర్ణయాలు ఉంటాయి అంటూ చెప్పారు. అలాగే ప్రభుత్వం మీ సంస్థ , కాలుష్యం వెదజల్లుతుంది కదా అని చెప్పగా, దాని పై ఎలాంటి కామెంట్స్ చేయం అని, అది కోర్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి, కోర్టుకే సమాధానం ఇస్తున్నాం అని, అది మీరు కూడా చూడవచ్చు అంటూ బదులు ఇచ్చారు. ప్రభుత్వ వేధింపుల గురించి అడగగా, ఇది సందర్భం కాదు అంటూ దాట వేసారు.