ప్రధాని మోదీ కుట్రలకు భయపడేది లేదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరులో సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ద్రోహాన్ని పార్లమెంట్‌లో ఎండగట్టానన్న కక్షతో నన్ను లక్ష్యంగా పెట్టుకుని ఈడీ, ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఈడీ నోటీసులు ఇచ్చి 8 గంటలకు పైగా ప్రశ్నించారు. వారడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చాను. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఇదంతా చేస్తున్నామని చెప్పి మొదటసారి కంటే రెండోసారి బాగా మాట్లాడి పంపించారు’.. అని ఎంపీ జయదేవ్ వివరించారు.
తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా పన్ను చెల్లిస్తున్న నంబర్‌వన్ ట్యాక్స్ పేయర్ని.. ఐటీ సంస్థ అవార్డులు కూడా ఇచ్చిందన్నారు. నా వద్ద ఏమీ దొరకలేదని.. నా బంధువులు, స్నేహితులను వేధిస్తున్నారని.. సినీనటుడు మహేష్‌బాబుకు చెందిన సంస్థలపై రెండుసార్లు ఐటీ దాడులు చేయడం ఇందులో భాగమేనన్నారు. కుటుంబాన్ని, వ్యాపారాన్ని రిస్క్‌లో పెట్టి పని చేస్తున్నానని తెలిపారు. బ్రిటీష్ వాళ్లతో పోరాడి తన తాత రాజగోపాలనాయుడు ఆచార్య ఎ.జీ.రంగాతో పాటు జైలుకు వెళ్లారని.. ఇప్పుడు మోదీతో పోట్లాడి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.
గల్లా జయదేవ్ సోమవారం ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. మిర్చి, పసుపు మద్దతుధర కోసం లోక్‌సభలో మాట్లాడినట్టు తెలిపారు. దుగ్గిరాలలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని కోరానన్నారు. గుంటూరు భూగర్భ డ్రైనేజీ కోసం రూ.903 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. తనపై ఆరోపణలు చేసిన వారెవరైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రధానిని ఎదిరించి లోక్‌సభలో మాట్లాడానని.. వెంటనే తనకు ఈడీ నోటీసులు వచ్చాయని చెప్పారు. ఆదాయ పన్ను అధికారులు దాడులు చేస్తామని తనను బెదిరించారని తెలిపారు. పన్నులు సరిగా కట్టడం వల్ల తనవైపు రాలేకపోయారన్నారు. తననేమీ చేయలేక తన బావ హీరో మహేశ్‌బాబుపై ఐటీ దాడులు చేసినట్టు గల్లా ఆరోపించారు.