మిష్టర్ ప్రైమ్ మినిస్టర్ అనే పదం మామూలు పదం కాదు. అప్పటి దాక మోడీకి ఎదురు లేదు అనుకున్న టైంలో, మొదటి సారి మోడీకి వ్యతిరేకంగా ఎదురు తిరిగాడు ఆంధ్రుడు. మమ్మల్ని అన్యాయం చేస్తున్నావ్ అని నినదించారు. ప్రజల ఆకాంక్షను, అదే విధంగా తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో వినిపించారు. అయితే, ఇప్పుడు కాలం తీరిపోయిన 16వ లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీల్లో గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ అన్ని విభాగాల్లోనూ దుమ్ముదులిపారు అనే విషయం వెలుగులోకి వచ్చింది. 120 చర్చల్లో పాల్గొనడమే కాకుండా ఆరు ప్రైవేట్ మెంబరు బిల్లులు ప్రవేశపెట్టారు. 495 ప్రశ్నలు సంధించారు. సభలో ఆయన హాజరు 85శాతంగా ఉంది. 98 చర్చల్లో పాల్గొని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు రెండోస్థానంలో నిలిచినట్లు పార్లమెంట్ అధ్యయన సంస్థ పీఆర్‌ఎస్ పేర్కొంది. 2014 జూన్ 1 నుంచి 2019 ఫిబ్రవరి 13వ తేదీ మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు.
అరకు ఎంపీ కొత్తపల్లి గీత 93 చర్చల్లో పాల్గొనడమే కాకుండా అత్యధికంగా 599 ప్రశ్నలు సంధించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనలేదు. ఎస్పీవై రెడ్డితోపాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్ ఒక్క ప్రశ్నా అడగలేదు. అందరికంటే తక్కువగా నంద్యాల ఎంపీ సభలో హాజరు 13 శాతంగా ఉంది. ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం ఎంపీ పి.అశోక్‌గజపతిరాజు కేంద్రమంత్రిగా పనిచేయడంతో జాబితాలో ఆయన హాజరు 100శాతంగా చూపించారు. ఏపీకి చెందిన ఎంపీల పనితీరు లోక్‌సభలో ఇలా ఉంది.