కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు తన వాహనంలో విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. కేసరపల్లి వద్దకు రాగానే నున్న నుంచి ద్విచక్రవాహనంపై వస్తున్న హరినారాయణరెడ్డి, సీతామహాలక్ష్మి దంపతులను ఎమ్మెల్యే వాహనం వేగంగా ఢీ కొంది. దీంతో రెండు వాహనాలు పల్టీలు కొట్టి డివైడర్ పైన పడ్డాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది.
తీవ్రంగా గాయపడిన హరినారాయణరెడ్డిని 108లో చినఅవుటుపల్లిలోని పిన్నమనేని సిద్దార్ధ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరినారాయణరెడ్డి కూడా మృతి చెందాడు. ఎమ్మెల్యే కారు అతివేగంగా నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్యే రామారావును తన గన్ మెన్ బయటకు తీసి ఆటోలో ఎక్కించి విమానాశ్రయానికి పంపించారు. ఏసీపీ విజయ్ భాస్కర్ ప్రమాద స్థలానికి చేరుకొని జాతీయ రహదారిపై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.