విభజన హామీలు, పోలవరం, నిధులు, ఇవే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కక్ష సాధింపులో ఇప్పుడు మరో విషయం కూడా చేరింది... అశోక్ గజపతి రాజు విమానయాన మంత్రిగా ఉన్న సమయంలో, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి, దుబాయ్ కు అంతర్జాతీయ సర్వీసుల కోసం కసరత్తు చేసి, ఎయిర్ ఇండియా సర్వీసు నడిపేందుకు సూత్ర ప్రాయంగా అంగీకరించారు. దీని కోసమే కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు కూడా గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నెలకొల్పారు.. పోలీసు వైపు నుంచి కూడా అవసరమైన బధ్రత కూడా సమకూర్చారు.. అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు ఎయిర్‌ఇండియా విముఖత చూపటం ఎయిర్‌పోర్టు అధికారులతో పాటు, కృష్ణాజిల్లా యంత్రాంగాన్ని సైతం నివ్వెరపరుస్తోంది! ఆఖరి నిమిషంలో ఎయిర్‌ఇండియా హ్యాండ్ ఇవ్వటంతో తర్జన భర్జనలు పడుతున్నారు...
ఎయిర్ ఇండియా తీరుపై ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు కృష్ణాజిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం దృష్టికి తీసుకొచ్చారు. సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జిల్లాలో రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ సర్వీసు విషయంలో తలెత్తిన సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించారు. అశోక్ గజపతిరాజు రాజీనామాతో కేంద్రంలో మన తరఫున కృషిచేసే పెద్దదిక్కు లేకుండా పోయారు. ఇదే సందర్భంలో అంతర్జాతీయ సర్వీసులు నడవటానికి వేగంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల కేంద్ర పౌరవిమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రభుత్వం లేఖ రాసిన తర్వాత కూడా స్పందన లేకపోగా.. ఎయిర్ ఇండియా చావు కబురు చల్లగా చెప్పింది.
అంతర్జాతీయ సర్వీసు నడిపే విషయంలో ఎయిర్ ఇండియా అనుసరించిన తీరు తీవ్ర విమర్శల పాలౌతోంది. విజయవాడ నుంచి దుబాయికి సర్వీసును నడపలేమనడానికి చెబుతున్న కారణాలు చూసి అధికారులు కూడా నివ్వరపోయారు. భద్రతాపరమైన కారణాల వల్ల హాపింగ్ ఫ్టైట్స్ విదేశాలు వెళ్లడానికి కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ అనుమతించటం లేదన్నది ఒక అంశంగా చెబుతోంది. ముంబై రూట్‌లో నడిపే విమాన సర్వీసునే విజయవాడ నుంచి దుబాయికి అక్కడి నుంచి షార్జాకు తిరిగి విజయవాడ, ముంబైలకు నడుపు తుంది. ఇది కూడా హాపింగ్ ఫ్లెట్ కాబట్టి.. అనుమతి కష్టమన్న ఒక వాదన తీసుకువస్తోంది. మరోవైపు ఇండియా, అరబ్ ఎమిరేట్స్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా సీట్ల సర్దుబాటు విదేశీ సంస్థలకు అనుకూలంగా ఉండటం వల్ల దుబాయికి సర్వీసును నడపలేమని ఎయిర్ ఇండియా చెప్పడం విమర్శలకు తావిస్తోంది.