గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ ఏటేటా అమాంతం పెరుగుతూ వెళ్తోంది. గత ఏడాది 7.5లక్షల మంది ప్రయాణికులు విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది 9లక్షల పైనే ఉండబోతోంది. అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే మాత్రం ఈ సంఖ్య 10 లక్షలు దాటుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అత్యధిక ప్రయాణికుల వృద్ధితో గత ఐదేళ్లుగా దేశంలోనే మొదటి స్థానంలో గన్నవరం నిలుస్తోంది. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే.. 1.5లక్షల మంది పెరగనున్నారు. దేశంలోని మరే విమానాశ్రయంలోనూ ఈ స్థాయిలో ప్రయాణికుల వృద్ధి లేదు. అంతకుముందు ఏడాది సైతం ప్రయాణికుల సంఖ్య 1.5లక్షలు పెరిగింది. ఈ ఏడాది అదే కొనసాగుతోంది.
గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రస్తుతం రోజుకు 2500 మంది రాకపోకలు సాగిస్తున్నారు. నెలకు 75 వేలకు పైగా ఉంటున్నారు. ఎనిమిది నగరాలకు 52 సర్వీసులు నిత్యం నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రతి పావుగంటకో సర్వీసు రావడం, పోవడం జరుగుతున్నాయి. దిల్లీ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై, విశాఖ, కడప, తిరుపతి నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతి నగరానికి వెళ్లే సర్వీసుకూ భారీ డిమాండ్ ఉంటోంది. దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు నడిచే సర్వీసులకు ఆక్యుపెన్సీ 80శాతం పైగా ఉంటోంది. దీంతో విమానయాన సంస్థలు సైతం కొత్తగా సర్వీసులను పెంచుకుంటూ వెళుతున్నాయి. 2016-17లో 7596 విమాన సర్వీసులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించగా.. ప్రస్తుత ఏడాదికి 18,720కు చేరాయి. ఏడాదిలోనే రెట్టింపవ్వడం గమనార్హం.
దేశంలోని అనేక ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగించేవారి సంఖ్య ఇక్కడి నుంచి నిత్యం వేల సంఖ్యలో ఉంటోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి ఏటా లక్షల సంఖ్యలో దేశంలోని అన్ని ప్రముఖ ప్రాంతాలకూ వ్యాపార, వాణిజ్య పనులపైనా, చదువులు, విహార యాత్రలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఎనిమిది నగరాలకే సర్వీసులు నడుస్తున్నాయి. అదికూడా.. తిరుపతి, కడప, విశాఖను వదిలేస్తే.. హైదరాబాద్‌తో సహా మరో ఐదు నగరాలకే సర్వీసులున్నాయి. కేరళ, అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా, భువనేశ్వర్, గోవా, పూణె, ఔరంగాబాద్ లాంటి అనేక నగరాలకూ ఇక్కడి నుంచి విపరీతమైన రద్దీ ఉంటుంది. వాటికీ సర్వీసులను ఏర్పాటు చేస్తే.. ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం ఉన్న దాని కంటే రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరో పక్క, ఇంటర్నేషనల్ సర్వీసులకి, ఎప్పుడో అనుమతులు లభించినా, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ కేంద్రాలు నెలకొల్పినా, కేంద్రం మాత్రం ఇంటర్నేషనల్ సర్వీసులకు అడ్డు పడుతుంది. ప్రస్తుతం, ఈ విషయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా ఆయనకు అవకాసం ఉన్న మేరకు సహయం చేస్తున్నారు..