నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న, గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు పూర్తి సుముఖంగా ఉన్నామంటూ.. మార్చి 15 తర్వాత అధికారులు ప్రకటించనున్నారు. ఆ తర్వాత.. విమానయాన సంస్థలు సర్వీసులను విదేశాలకు ఇక్కడి నుంచి నడపొచ్చని ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత ముందుకొచ్చే విమాన సంస్థలు.. 45 రోజుల ముందు షెడ్యూల్‌ను ప్రకటిస్తాయి. షెడ్యూల్‌ను విడుదల చేశాక టిక్కెట్ల అమ్మకం ప్రారంభమవుతుంది. మే నుంచి అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి నేరుగా విదేశాలకు నడవనున్నాయి. దీనికోసంఅవసరమైన సన్నద్ధతపై విమానాశ్రయంలో సోమవారం నిర్వహించిన ఇమ్మిగ్రేషన్‌ శిక్షణ తరగతుల కార్యక్రమంలో అధికారులు చర్చించి.. నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ విమానాశ్రయం అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉందంటూ మార్చి 15న జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు. ఈ డిక్లరేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం పంపించనున్నారు. ఆ తర్వాత విమానయాన సంస్థలతో ప్రభుత్వం సైతం సంప్రదింపులు జరుపుతుంది.

gannavaram 13022018 2

గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే అంతర్జాతీయ టెర్మినల్‌ భవనం సిద్ధమైంది. గతంలో వినియోగించిన పాత టెర్మినల్‌ భవనాన్నే రూ.2 కోట్లను వెచ్చించి.. అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా మార్పులు చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ, అంతర్జాతీయ సేవలు అందించేందుకు వీలుగా కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయాలు, కన్వేయర్‌బెల్ట్‌లు, ఎక్స్‌రే బ్యాగేజీ యంత్రాలను పూర్తిస్థాయిలో అమర్చారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది ఒక్కటే కొరత ఉంది. సోమవారం నుంచి 13మంది రాష్ట్ర పోలీసు సిబ్బందికి ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు అనుగుణంగా శిక్షణను ప్రారంభించారు. 15 రోజుల్లో వీరికి శిక్షణ పూర్తయి.. సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారు. ఈలోగా ఇమ్మిగ్రేషన్‌ సేవల కోసం కేటాయించిన కార్యాలయంలో కంప్యూటర్లు, కేబుళ్లను ఏర్పాటు చేయడం పూర్తవుతుంది.

gannavaram 13022018 3

మరోవైపు కస్టమ్స్‌ విభాగం కూడా ఇక్కడి నుంచి సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కస్టమ్స్‌ డీసీ శ్రీకాంత్‌, ఫారినర్‌ రీజినల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఆర్‌వో) భాస్కర్‌రెడ్డి తదితరులు సోమవారం అంతర్జాతీయ టెర్మినల్‌, ఏర్పాట్లను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) తరఫున అన్ని రకాల సిద్ధంగా ఉన్నామని విమానాశ్రయ అధికారులు వారికి వివరించారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఇమ్మిగ్రేషన్‌ సేవలు అందించేందుకు తాజాగా శిక్షణ తీసుకుంటున్న 13మంది సిబ్బంది సిద్ధమవుతారు. అనంతరం.. రెండు వారాల్లో మిగతా అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసి.. మార్చి 15న ఏఏఐ, ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ విభాగాలన్ని కలిసి జాయింట్‌ డిక్లరేషన్‌ను ప్రకటించాలని నిర్ణయించారు... గన్నవరం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు తొలి అవకాశం ఎయిరిండియా సంస్థకే ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిరిండియా ముంబయికి నడుపుతున్న సర్వీసును దుబాయ్‌ వరకూ పొడిగించనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలుత అదే విమానం ఇక్కడి నుంచి విదేశాలకు ఎగరనుంది. తొలుత దుబాయ్‌కు ముంబయి మీదుగా ఈ సర్వీసును నడపనున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read