నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ లో, విజయవాడ ఇంటర్నేషనల్ టెర్మినల్ సిద్ధమైంది. ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాల పనులు పూర్తయ్యాయి. సెంట్రలైజ్డ్ ఏసీ, చక్కటి ఇంటీరియర్‌తో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్ దేశ, విదేశీ ప్రయాణికులకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి గోడలపై కృష్ణాజిల్లా చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంతోపాటు వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అమరావతి గురించి అర్థమయ్యేలా చక్కటి చిత్రాలను ఏర్పాటుచేశారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా రూ.5కోట్ల వ్యయంతో అంతర్జాతీయ ప్రమా ణాలకు అనుగుణంగా దీన్ని ఆధునీకరించింది.
ఎయిర్‌లైన్స్ కౌంటర్లు, చెకిన్ కౌంటర్లు, ప్రయాణికులు, సందర్శకుల ప్రీ వెయిటింగ్ రూం, సెక్యూరిటీ చెకింగ్, ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు, పాసింజర్స్ సిట్టింగ్ ఏరియా, వీఐపీ లాంజ్ వంటివి డిపార్చర్ బ్లాక్‌లో ఉన్నాయి. ప్రవేశద్వారం వద్ద ఒకటి, భద్రత తనిఖీ విభాగం లోపల రెండు చొప్పున బ్యాగేజీ చెకింగ్ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇక ప్రయాణికుల బ్యాగేజీ చెకిన్, కన్వేయర్ బెల్ట్, పాసింజర్ వెయిటింగ్ హాల్, కస్టమ్స్ చెకిన్ పాయింట్స్ అరైవల్ బ్లాక్‌లో ఉన్నాయి. ఈ బ్లాక్ బయటి గోడల మీద వేయించిన ఉండవల్లి గుహలు, కొండపల్లి బొమ్మలు, ప్రకాశం బ్యారేజీ, కూచిపూడి నృత్యాలు వంటి ఆర్ట్ పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇమిగ్రేషన్ సిబ్బందికి, కస్టమ్స్ విభాగానికి అవసరమైన చాంబర్లను సిద్ధం చేశారు. సెక్యూరిటీ చెకింగ్ పూర్తయిన ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన పాసింజర్ లాబీ(సిట్టింగ్ ఏరియా)కి అనుబంధంగా అనేక సదుపాయాలు కల్పించారు. చంటిపిల్లలకు పాలు పట్టడానికి, ప్రార్థన చేసుకోవడానికి, స్మోకింగ్ కోసం ప్రత్యేకంగా చాంబర్లు ఏర్పాటు చేశారు.
టెర్మినల్ ముందు, వెనుక చక్కటి ల్యాండ్‌స్కేపింగ్‌తో గార్డెన్, విశాలమైన రహదారి, సెంట్రల్ డివైడర్ , రోడ్డుకిరువైపులా గ్రీనరీని అభివృద్ధి పరిచారు. అంతర్జాతీయ టెర్మినల్ దగ్గర పటిష్ఠ భద్రత కల్పించారు. సాధారణ సెక్యూరిటీతో పాటు పోలీసు సిబ్బంది, ఎస్పీఎఫ్ బలగాలను కూడా మోహరించా రు. భద్రతపరంగా ఎయిర్‌పోర్టును దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. కస్టమ్స్ విభాగం వెనుక వీఐపీ లాంజ్‌కు వెళ్లే మార్గంలో అమరావతి ఊహాచిత్రం కనువిందు చేస్తుంది. ఖరీదైన సోఫాసెట్లు, టీపాయ్లతో ఈ లాంజ్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. మువ్వన్నెల జెండాలో ఏపీ మ్యాప్, అందులో గౌతమ బుద్ధుడు, కృష్ణానది, ప్రకాశం బ్యారేజీ, దుర్గగుడి, తెలుగుతల్లి విగ్రహం చిత్రాలు కనిపించేలా ఏర్పాటు చేశారు. పక్కనే కూచిపూడి నృత్యభంగిమ చిత్రం కూడా ఆకర్షిస్తుంది. లాంజ్ గోడలపై రాజధాని ప్రణాళికలకు సంబంధించిన చిత్రాలను ఉంచారు.