ఇప్పటి వరకు రాజధాని తరలిపోతే అమరావతి వాసులే ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యేది. నిజానికి అమరావతి తరలిపొతే రాష్ట్రం మొత్తం ఇబ్బందే అయినా, ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష ఇబ్బంది, అమరావతికి భూములు ఇచ్చిన రైతులు. అయితే ఇప్పుడు అమరావతి రైతులకు గన్నవరం రైతులు కూడా తోడయ్యారు. దీనికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగటంతో సెంటర్ ప్లేస్ అయిన విజయవాడలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రాధాన్యత ఏర్పడింది. ఎయిర్పోర్ట్ రాష్ట్రం మధ్యలో ఉండటంతో, గన్నవరం చుట్టు పక్కల ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో కేంద్రం భూమి సమీకరణ చేసి ఇస్తే, ఎయిర్ పోర్ట్ విస్తరణ చేస్తాం అని చెప్పటంతో, రంగంలోకి దిగిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రైతులతో మాట్లాడింది. అయితే అప్పటికే భూములు రేటు ఎక్కవగా ఉండటంతో, రైతులు ముందుకు రాలేదు. దీంతో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతులకు అమరావతిలో రాజధాని తరహా ప్యాకేజి ఇవ్వటానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవటంతో, రైతులు 700 ఎకరాలు ఇచ్చారు.
దీంతో విస్తరణ పనులు మొదలయ్యాయి. 80 శాతం మందికి అమరావతిలో ఫ్లాట్లు కూడా ఇచ్చారు. మిగతా వారికి భూములు ఇచ్చే క్రమంలో, ప్రభుత్వం మారింది. అంతే మొత్తం తలకిందులు అయ్యింది. మిగతా వారికి ఫ్లాట్లు ఇవ్వలేదు. ఇంకా ప్యాకేజిలో చెప్పినట్టు చెయ్యలేదు. ఈ లోపు అమరావతి మూడు ముక్కలు అయ్యింది. దీంతో అమరావతి రేట్లు పడిపోయాయి. ఈ క్రమంలో గన్నవరం రైతులు ఎదురు తిరిగారు. ఎంతో రేటు ఉన్న భూమి, అమరావతి అభివృద్ధి అయితే, అక్కడ ఫ్లాట్ రేటు ఉంటుందని ప్యాకేజికి ఒప్పుకుంటే, ఇప్పుడు నాశనం చేసారని రైతులు ఎదురు తిరిగారు. తమ భూముల్లో వారి సాగు మొదలు పెట్టారు. దుక్కి దున్ని, నాట్లు వేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఎయిర్ పోర్ట్ కు ఇచ్చిన భూముల్లో తిరిగి సాగు మొదలు పెట్టారు. దీంతో ఎయిర్ పోర్ట్ అధికారులు సంప్రదింపులు జరిపినా ఉపయోగం లేకుండా పోయింది. అటు ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదని, ఈ సమయంలో కోర్టుకు వెళ్తే సమస్య మరింత జటిలం అవుతుందని వాపోతున్నారు. ఇక రైతులు తమకు జరిగిన అన్యాయం పై న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు.