రాజధాని ప్రాంతంలో సైబర్‌వాడ కేసరపల్లిలో హెచ్‌సీఎల్ నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఒక మహాయజ్ఞంలా రాత్రింబవళ్లూ పనులు జరుగుతున్నాయి. వేసవిని సైతం లెక్క చేయకుండా కార్మికులు అహోరాత్రులు కష్ట పడుతున్నారు. ఎట్టి పరిస్థితులలో ఏడాదికల్లా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా హెచ్‌సీఎల్ యాజమాన్యం ఒక పద్ధతి ప్రకారం పనులు చేయిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పడి హెచ్‌సీఎల్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే జీ ప్లస్ 1 నిర్మాణ స్థాయి వరకు రావటం విశేషం! ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన మూడు టవర్లలో రెండు టవర్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. జీ ప్లస్ 5 విధానంలో నిర్మించాల్సి ఉండగా రెండు టవర్ల నిర్మాణ పనులు జీ ప్లస్ 1 స్థాయి వరకు రావటం విశేషం!
మూడవ టవర్ నిర్మాణ పనులు ప్రస్తుతం ప్రారంభించారు. కీలకమైన బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి కావటం వల్ల మిగిలిన ఫ్లోర్ల నిర్మాణం త్వరగా చేపట్టడానికి అవకాశం ఉంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ పార్క్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణ పనులు ఇంత శరవేగంగా జరగటానికి కాంట్రాక్టు సంస్థ తీసుకున్న చర్యలేనని చెప్పవచ్చు. కాంట్రాక్టు సంస్థ నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వనరులను ముందస్తుగా సిద్ధంచేసు కోవటం వల్లే ఇంతవేగంగా పనులు ప్రారంభం కావటంతో పాటు పురోగతిలో ఉంది. నిర్మాణ పనులకు అవసరమైన నీటి కోసం సమీప గ్రామాల నుంచి సేకరించటానికి వీలుగా పైపులైన్ నిర్మాణం చేపట్టి నేరుగా నిర్మాణస్థలికే నీటిని తీసుకువస్తోంది. పెద్ద ఎత్తున మెటీరియల్‌ను సిద్ధంచేసింది. హాట్‌మిక్స్ ప్లాంట్‌ను సైట్‌లోనే ఏర్పాటు చేసింది. లేబర్ కోసం ఏకంగా కృత్రిమ కాలనీనే సృష్టించింది.
బ్లాకులవారీగా పనులు చేపట్టే కార్మికుల కోసం అదే బ్లాకుల వారీగా వర్గీకరించి వారికి కృత్రిమ కాలనీలో బస ఏర్పాటుచేసింది. దీంతో అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పనులు జరుగు తున్నాయి. బేస్‌మెంట్ పనులు వేయటానికే చాలా కాలం పడుతుంది. నెలల వ్యవధిలోనే జీ ప్లస్ 1 స్థాయికి భవన నిర్మాణ పనులు రావటం అసాధారణ విషయం. హెచ్‌సీఎల్ సంస్థ ముందస్తుగా డిజైన్‌లో నిర్దేశించుకున్న విధంగానే చెట్లను తొలగించింది. ఏపీఐఐసీ అధికారులు అప్పగించిన సైట్‌లో చెట్లన్నింటినీ చూసిన హెచ్‌సీఎల్ యాజమాన్యం క్యాంపస్ గ్రీన్‌గా కని పించటానికి ఇక్కడ ఉన్న చెట్లను సంరక్షించాలని నిర్ణయించింది. భవనాల స్థానంలో ఉన్న చెట్లను మాత్రమే తొలగించి మిగిలిన చోట్ల చెట్లను అలానే ఉంచేసింది. రేపు ఈ భవనాలు పూర్తయిన తర్వాత ఒక తోటలో హెచ్‌సీఎల్ క్యాంపస్ ఉన్నట్టుగా ఉంటుంది. Source:Andhrajyothy