రాజకీయ నాయకులు వివిధ రూపాల్లో ప్రజల సొమ్ము నొక్కేయటం చూసాం కాని, గన్నవరంలో జరిగిన లాంటి సంఘటన మాత్రం బహుసా మొదటది కావచ్చు. ఏపీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ పై కేసు నమోదు అయింది. తనకు రావాల్సిన నష్టపరిహారం లక్ష రూపాయలు పద్మశ్రీ కాజేశారంటూ కృష్ణాజిల్లా ఆత్కూరు పోలీస్ స్టేషన్లో మరియంబీ అనే మహిళ కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉంగుటూరు మండలం, ఆత్కూరులో నిర్వహించిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో తొలుత తన గోడు వెళ్లబోసుకుంటూ బాధితురాలు కన్నీటి పర్యాంతమైంది. దీంతో ఎమ్మెల్యే వంశీ ఏం కావాలంటూ ప్రశ్నించారు.
సాయం కావాలని ఆమె కోరగా.. ఎమ్మెల్యే అధికారులకు సాయం చేయాలని సూచించారు. అయితే తనకు కావాల్సింది డబ్బులు కాదంటూ అసలు విషయం చెప్పింది. తన కుమారుడు మృతి చెందిన తర్వాత డెయిరీఫాం యజమాని ఇచ్చిన నష్టపరిహారాన్ని సుంకర పద్మశ్రీ తనకు ఇవ్వడంలేదని బాధితురాలు ఆరోపించింది. రెండేళ్ల క్రితం మరియంబీ కొడుకు పఠాన్ సాయికుమార్ ఓ డెయిరీ ఫామ్లో పనిచేస్తూ.., చెరువులో పడి మృతిచెందాడు. ఆ సమయంలో డెయిరీ ఫామ్ యజమాని దొప్పలపూడి ప్రవీణ్ నుంచి తనకు నష్టపరిహారం ఇప్పిస్తామంటూ కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం వహించారని చెబుతోంది మరియంబి.
నష్టపరిహారం ఇచ్చిన మొత్తం తన వద్దే ఉంచుకుని రెండేళ్లయినా ఇవ్వట్లేదని ఆరోపిస్తూ గ్రామదర్శినిలో కన్నీళ్లు పెట్టుకుంది మరియంబి. డబ్బులు అడిగితే సుంకర పద్మశ్రీ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తోందని ఆరోపించింది. మరియంబీ వాదన విన్న వంశీ పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పిర్యాదు చేసింది. తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు సుంకర పద్మశ్రీ. తనకు లక్ష రూపాయలు ఇచ్చింది నిజమే అయితే... ఎవరు ఇచ్చారో వారే వచ్చి పట్టుకెళ్లాలంటూ ఫోన్లోనే సవాల్ విసిరారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే అక్రమకేసులు పెడుతున్నారని ఆరోపించారు.