మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారుతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. ఆయన ప్రతిసారి ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అయినా సారే గంటా పార్టీ మారుతున్నారు అంటే వార్తలు వస్తూనే ఉంటున్నాయి. నిన్న, ఈ రోజు కూడా ఈ వార్తలు మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి తీవ్ర స్థాయిలో ఈ ప్రచారం ఉంది. గంటా శ్రీనివాస్, విజయసాయి రెడ్డితో చర్చలు జరుపుతున్నారని, ఆయాన చేరిక దాదపుగా ఖరారు అయిన సమయంలో, మంత్రి అవంతి శ్రీనివాస్ అడ్డు పడటంతో, గంటా చేరిక ఆగిపోయింది అంటూ వార్తలు వస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ ఆపకపోయి ఉంటే, గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, వైసిపీలో చేరే వారని, అయితే విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ తో బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీలోని కొంత మంది నేతలు కూడా, గంటా పార్టీ మారిపోతున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆయన బీజేపీలోకి వేల్లిపోతున్నారని ప్రచారం చేసారు. అయితే గంటా ఈ ప్రచారం పై, ఈ రోజు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నేను వైసిపీలోకి వెళ్ళాలి అనుకుంటే, నాకు ఎవరి దయ అవసరం లేదు, ఈ నిమషాన వెళ్ళిపోతా, నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఎన్ని సార్లు పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చినా ఎదో ఒక ప్రచారం చేస్తున్నారని, వైసీపీలో చేరాలనుకుంటే తనను ఎవరూ ఆపలేరంటూ, అటు వైసీపీ నేతల ప్రచారానికి, ఇటు సొంత పార్టీలో కొంత మంది నేతలకు గట్టిగా తగిలేలా గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఈ రోజు విజయనగరం జిల్లా లో పర్యటించిన గంటా ఈ వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు అవంతి శ్రీనివాస్ ను ఉద్దేశించి చేసినవిగా అర్దమవుతున్నాయి. మంత్రి అవంతి శ్రీనివాస్, ఈ ప్రచారం చేస్తున్నారని, తాను అడ్డుకోబట్టే గంటాకు వైసిపీలోకి ఎంట్రీ లేదు అనే ప్రచారం చేస్తున్నారని, గంటా భావించి, ఇలా మాట్లాడారని తెలుస్తుంది. గంటాకి, అవంతి శ్రీనివాస్ కి, పీఆర్పీలో ఉన్న దగ్గర నుంచి వైరం ఉంది. అవంతి శ్రీనివాస్ మంత్రి అయిన తరువాత, గంటా టార్గెట్ గా ఆయన్ను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపధ్యంలోనే గంటా పార్టీ మార్పు వ్యాఖ్యలు, అవంతి ప్రచారం చేపిస్తున్నారని, నమ్ముతున్న గంటా, ఈ రోజు గట్టి సమాధానం ఇచ్చారు. అలాగే అమరావతి మార్పు పై, బొత్సా చేస్తున్న వ్యాఖ్యల పై కూడా గంటా ఘాటుగా స్పందించారు.