వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డి, ట్విట్టర్ ద్వారా అందరినీ కవ్విస్తూ ఉంటారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమేరకు ఉపయోగపడుతుందో తెలియదు కాని, ఆయన వేసే కొన్ని కొన్ని ట్వీట్స్ తో వైసీపీ ఇరుకున పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. విజయసాయి రెడ్డి వేసే ట్వీట్స్, ఆలోచన రేకెత్తించే విధంగా ఉండకపోయినా, అవతల వారిని కవ్విస్తూ, వెకిలిగా ఉంటాయి. ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ను కవ్విస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి అంటూ, ఉద్యమం ఉదృతంగా జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా కేంద్రం తరువాత, వైసీపీ వైపే, అందరూ చేతులెత్తి చూపిస్తున్నారు. తమ పై వస్తున్న వ్యతిరేకత తగ్గించుకోవటానికి, వైసీపీ అనేక డ్రామాలు ఆడుతున్నా ప్రజలు నమ్మటం లేదు. ఒక పక్క కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి పోరాటం చేస్తున్నాయి. వీరికి పార్టీలు కూడా సహకారం అందిస్తున్నాయి. రాజకీయంగా ఈ ఉద్యోమం ముందుకు తీసుకుని వెళ్లేందుకు, టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, మొదటిగా తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన రాజీనామా చేసిన ఫార్మాట్ సరిగ్గా లేకపోవటంతో, అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన మళ్ళీ స్పీకర్ ఫార్మటులో, రాజీనామా లేఖను పంపించారు.
అయితే దీని పై కూడా వైసీపీ హేళన చేస్తూ మాట్లడుతుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి, ఇదంతా డ్రామా అంటూ , గంటాను టార్గెట్ చేసారు. దీంతో గంటా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఈ రోజు ఏకంగా స్పీకర్ తమ్మినేని వద్దకు వెళ్లారు. తన రాజీనామా ఆమోదించాలని స్వయంగా కోరారు. దీంతో గంటా, దూకుడును విజయసాయి రెడ్డి అంచనా వేయలేక పోయారు. ఇదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. గంటా రాజీనామా ఆమోదిస్తే, ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి హీరో అవుతారు. అలా అని ఆమోదించకుండా ఉంటే, మీరు రాజీనామా చేయరు, చేసే వారిని కూడా, చేయనివ్వరు అంటూ, ఎదురు వైసీపీ మీదే విమర్శలు వస్తాయి. దీంతో, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఎటూ తేల్చుకోలేక పోతుంది. గంటా ఏదో రాజకీయం గేమ్ ఆడుతున్నాడని, విజయసాయి రెడ్డి భావించి, అతన్ని కవ్వించటంతోనే, ఇక్కడ దాకా వచ్చిందని, అందరి సంగతి మనకెందుకు, మన సంగతి మనం చూసుకుంటే సరిపోతుంది కదా అని, సొంత పార్టీలోనే విజయసాయి రెడ్డి వైఖరి పై అసంతృప్తి వ్యక్తం అవుతుంది.