ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెత్త సంఘటన, దేశ వ్యాప్తంగా చర్చనీయంసం అయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు అంటూ, కొన్ని జాతీయ బ్యాంకులు ముందు, చెత్త పోసి మునిసిపల్ సిబ్బంది నిరసన తెలిపారు. కమిషన్ చేయమంటేనే చేసాం అని చెప్పారు. అయితే ఈ చెత్త సంఘటన పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే చూస్తాం కూర్చోం అని వార్నింగ్ ఇచ్చింది. అంతే కాదు, దీని పై విచారణ కూడా జరుపుతున్నామని చెప్పింది. అయితే ఈ లోపే రాష్ట్ర ప్రభుత్వం దిద్దు బాటు చర్యలు చేపట్టింది. కేంద్రం విచారణ చేస్తే, పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయనో ఏమో కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరుపునే విచారణ చేసి, చర్యలు తీసుకున్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ ఎన్.ప్రకాష్‌రావును, అలాగే మున్సిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ ను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసారు. అయితే ఈ ఘటనలు విజయవాడ, మచిలీపట్నంలో కూడా జరిగాయి. అయితే అక్కడ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం వారి వద్ద నుంచి వివరణ కోరినట్టు తెలుస్తుంది. అయితే కేవలం ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ను తొలగించటం పై, విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ శాఖ కమిషనర్లను వదిలేయటం పై, విమర్శలు వస్తున్నాయి.
టిడిపి నేత వర్ల రామయ్య స్పందిస్తూ, కేంద్రం కన్నెర్రతో తోకముడిచిన రాష్ట్ర ప్రభుత్వం దళితుడని ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ను సస్పెండ్ చేసి మిగతావారిని ఎందుకు చేయలేదు? అంటూ ప్రశ్నించారు. బ్యాంకర్స్ పై కక్షపూరిత చర్యకు పూనుకున్నారని, బ్యాంకర్స్ ను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కృష్ణా జిల్లా ఒక ముఖ్య ఆధికారి ఆదేశాలతో జిల్లాలో పలుచోట్ల “చెత్త”ను తీసుకెళ్లి ఆయా బ్యాంకుల ప్రధాన ద్వారాల ముందు వెయ్యాలని మున్సిపాలిటీలకు అనధికార ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలు ఆయా మున్సిపల్ కమిషనర్లు తూ..చా.. తప్పకుండా పాటించి, తాము సేకరించిన చెత్తను ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన బ్యాంకుల ముందు పడవేయడం ఈ ప్రభుత్వ కక్షసాధింపుకు ప్రబల నిదర్శనం అని అన్నారు. "రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన దళిత వర్గానికి చెందిన కమిషనర్ ప్రకాశ్ రావు ను సస్పెండ్ చేసింది. ఎన్నోచోట్ల బ్యాంకుల ముందు చెత్త వేస్తే ఒక్క ప్రకాశ్ రావును సస్పెండ్ చేయడం ఈ ప్రభుత్వ దళిత వ్యతిరేక విధానాలకు నిదర్శనం." అని వర్ల రామయ్య అన్నారు.