జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ పై చేసిన వ్యాఖ్యల పై ఒక టీవీ షో లో, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. బీజేపీని సమర్థిస్తున్నారా.. వ్యతిరేకిస్తున్నారా అని ముస్లిం నేతలు పవన్‌ను ప్రశ్నించగా ఎంతో పరిపక్వతతో సమాధానమిచ్చాడని గరికపాటి ప్రశంసల జల్లు కురిపించారు. ఆ వార్త పేపర్‌లో చదివినప్పుడు ఎంతో ఆనందించానన్నారు. బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ అని.. ఈ రోజుల్లో గిరిగీసుకుని కూర్చోకూడదంటూ పవన్ చెప్పిన సమాధానం తనకు ఎంతో నచ్చిందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలున్నప్పుడు ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయక తప్పదని పవన్ చేసిన వ్యాఖ్యలు అతడి రాజకీయ పరిపక్వతతను తెలియచేస్తున్నాయన్నారు. ఆ వ్యాఖ్యకు జోహార్ అన్నారు గరికపాటి. ఇలా అంటున్నానని తను పవన్ పార్టీని సమర్థిస్తున్నానని కానీ.. వ్యతిరేకిస్తున్నానని కానీ అర్థం కాదన్నారు. ఆ అవసరం తనకు లేదన్నారు. అయితే గరికపాటి వారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ని తిట్టారో, పొగిడారో అర్ధం కాక పవన్ కళ్యాణ్ ఫాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బీజేపీని వెనకేసుకుని వచ్చినందుకు, చురకలు అంటించారేమో అని అనుకుంటున్నారు.
కాకినాడలో ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పవన్ మాట్లాడుతూ బీజేపీ పై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని జవహర్ అలీ అనే న్యాయవాది పవన్‌ను కోరారు. దీనిపై పవన్ స్పందిస్తూ... ‘‘బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు.. అదొక రాజకీయపార్టీ. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు... ఆ పార్టీ సంఘ్‌తో ఉంటుందని చాలామంది చెప్పారు. అలాగైతే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం. ఇదే టీడీపీ గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించింది. ఆ తర్వాత మళ్లీ చేతులు కలిపింది. ప్రాంతీయ పార్టీలు వాటిలో ఏదో ఒకదానితో కలవాల్సిందే. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు భయపడాలి’’ అని తెలిపారు.