ఆంధ్రప్రదేశ్ రాజధానిగా 2014లో, అప్పటి అధికార పక్షం, ప్రతిపక్షం కలిసి, అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు. అసెంబ్లీలో అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం కూడా చేసారు. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, ఆంధ్రప్రదేశ్ రాజధాని పై ఒక కమిటీ వేసారు. దీని కోసం, జీఎన్ రావు కమిటీని జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేసారు. ఈ రోజు కమిటీ నివేదికను జగన్ మోహన్ రెడ్డికి అందజేసింది. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ ఆఫీస్ లో జీఎన్ రావు కమిటీ సభ్యులు జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ నివేదికను అందజేశారు. కమిటీలని అంశాల పై, వారు జగన్ కు వివరించారు. అయితే కమిటీలో ఏ అంశాలు ఉన్నాయి ? వారు ఏమి ప్రతిపాదనలు ఇచ్చారు, లాంటి అంశాల పై ఇప్పుడు అందరికీ ఉత్కంఠ నెలకొంది. రాజధాని పై వేసిన జీఎన్ రావు కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రదేశాల్లో పర్యటించారు. ప్రజలతో పాటుగా, వివిధ వర్గాల నుంచి వారి అభిప్రాయాలు సేకరించారు. అయితే వీరు అమరావతిలో పర్యటన చెయ్యలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే ఈ కమిటీ విషయం పై, ఈనెల 27న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని, ఆ కమిటీని ఆమోదించిన తర్వాతే ఈ నివేదికలోని అంశాలను, ప్రజలకు చూపించే అవకాసం ఉందని తెలుస్తుంది. తరువాత జనవరి నెలలో అఖిల పక్ష సమావేశం జరుగుతుందని చెప్తున్నారు. అయితే జగన్ ని కలిసిన తరువాత, కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. రీజినల్ బాలన్స్ ను రూపుమాపటంలో, రాజధానిని ఎలా ఉపయోగించాలో చెప్పామని వారు మీడియాతో చెప్పారు. అంటే వీరి మాటలను బట్టి, దాదపుగా రాజధానిని మూడుగా చేస్తామని జగన్ చెప్పిన విధంగానే ఉన్నట్టు తెలుస్తుంది. 13 జిల్లాలు ఎలా అభివృద్ధి చెయ్యాలి, పర్యావరణాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విధంగా రిపోర్ట్ ఇచ్చినట్టు చెప్పారు.
మూడు ప్రాంతాల సమస్యల పై అధ్యయనం చేసామని, దానికి అనుగుణంగా సలహాలు ఇచ్చామని చెప్పారు. తీర ప్రాంతంలో అభివృద్ధి ఒత్తిడి ఎక్కువగా ఉందని, చెప్పారు. రాయలసీమలో జిల్లాలు అన్నీ వెనుకబడి ఉన్నాయని, అన్నారు. కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది ఉన్నాయని, మరి కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని అన్నారు. సమగ్ర అభివృద్ధి జరగాలని చెప్పమని అన్నారు. మరి ఈ రిపోర్ట్ లో పూర్తిగా ఏముందో తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 13న రాజధాని పై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. రిటైర్డ్ ఐఏఎస్ జీఎన్ రావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రొఫెసర్ మహావీర్, అంజలీ మోహన్, శివానందస్వామి, కేటీ రవీంద్రన్, డాక్టర్ అరుణాచలం సభ్యులుగా ఉన్నారు.