ఆదివారం పూట రాష్ట్ర ప్రజలకు విషాద వార్త. గోదావరి నదిలో ఘోర బోటు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మంద సమీపంలో పర్యాటక బోటు ప్రమాదానికి గురైంది. బోటు పూర్తిగా మునిగిపోయినట్టు సమాచారం. ఈ బోటులో 61 మందికి పైగా ఉన్నారని సమాచారం. వీరిలో 50 మంది పర్యాటకులు, మిగతా 11 మంది బోటు సిబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల టూర్‌కు వెళ్తున్న సమయంలో, ఈ ఘటన జరిగింది. అయితే లైఫ్ జాకెట్లు వేసుకున్న వారిలో 14 మంది సురక్షితంగా అక్కడి గ్రామస్తులు బయటకు చేరుకున్నారు. లైఫ్‌జాకెట్లు వేసిన వారిని స్థానికులు పడవల్లో వెళ్లి వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. నిన్నటి వరకు గోదావరిలో 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. ఇంత వరద ఉద్ధృతి ఉంటే బోటుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రత్యక్షసాక్షులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి వెళ్లేందుకు పయనమయ్యారు. మరో పక్క చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుభ్రమణ్యం, అక్కడ కలెక్టర్ తో మాట్లాడి సహయక చర్యలు పై అరా తీసారు. రాజమండ్రి నుంచి ఒక హెలికాప్టర్ కూడా సహాయక చర్యల కోసం వెళ్లినట్టు తెలుస్తుంది. పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావటంతో, అక్కడ ఏమి జరిగిందో తెలియటం లేదు. కమ్యూనికేషన్ లేకపోవటంతో, సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. మరో పక్క అక్కడకు వెళ్ళటానికి రోడ్ మార్గం కూడా లేదని తెలుస్తుంది. లాంచీల్లోనే అక్కడకు వెళ్ళే అవకాసం ఉందని సమాచారం. విషయం తెలియటంతో, అధికారులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి బయలుదేరారు.
గోదావారి తీవ్రత ఎక్కువగా ఉండటం, ఆ ప్రదేశంలో లోతు ఎక్కువగా ఉండటంతో, గల్లంతైన వారు క్షేమంగా ఉంటారో లేదో అని అక్కడ గ్రామస్తులు అంటున్నారు. అయితే ఇంత వరదలో, అసలు పర్యాటక బోటు ఎలా వెళ్ళింది ? అసలు ఇది వెళ్ళటానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు ? ఇంత ఫ్లో లో, అక్కడ ఇళ్ళు మునిగిపోతుంటే, అలాంటి చోటకు ఎలా అనుమతులు ఇచ్చారు అనే విషయాల పై అక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో జరిగిన సంఘటనలు అప్పుడు, పర్యాటక శాఖ పై ఎన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటి నుంచి కూడా పర్యాటక శాఖ ఇంకా పాఠాలు నేర్చుకోలేదని ఈ సంఘటనతో తెలుస్తుంది. ఏది ఏమైనా, నష్టం తక్కువ ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం.