అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఇటీవలే అంగన్వాడీలు, ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీరు ఈ పెరిగిన జీతం వచ్చే నెలలో అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం చంద్రబాబునాయుడు అంగన్వాడీలు, ఆశా వర్కర్ల భవిష్యత్తుకు మరింత భరోసా కల్పించారు. ఇప్పటివరకూ అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా వర్తింపజేస్తూ వచ్చారు. తాజాగా అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లకు చంద్రన్నబీమా వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి విజయవాడలో నిర్వహించిన సభలో అధికారికంగా ప్రకటించారు.
ఈ బీమా పథకం ద్వారా సహజంగా మరణిస్తే.. రూ. రెండు లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షలు, ప్రమాదంలో పూర్తిగా అంగవైకల్యం ఏర్పడితే రూ. 5 లక్షలు, పాక్షిక అంగవైకల్యం ఏర్పడితే రూ. 2.50 లక్షలు చంద్రన్నబీమా ద్వారా ఆ కుటుంబానికి అందజేస్తారు. జిల్లాలో ఆశావర్కర్లు 3,082 మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలిపి సుమారు 12వేల మంది పనిచేస్తున్నారు. వీరందరికీ చంద్రన్నబీమా వర్తింపజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే వేతనాలు పెంచిన సీఎం తాజాగా చంద్రన్నబీమా వర్తింపజేయడం తో అంగన్వాడీలు, ఆశా వర్కర్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మంత్రి పరిటాల సునీతకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
7500లుగా ఉన్న అంగన్వాడీ టీచర్ల వేతనాన్ని రూ.10,500లకు, అలాగే, రూ.4500లుగా ఉన్న ఆయాల వేతనాల్ని రూ.6000లకు ఇటీవలే చంద్రబాబు పెంచారు. అలాగే ఆశా వర్కర్లకి నెలకు కనీస వేతనం రూ.3వేలు తప్పనిసరి చేస్తున్నట్టు చెప్పారు. వారికి స్మార్ట్ఫోన్లు ఇస్తామని ప్రకటించారు. అలాగే వారికి నెలకు రూ.6వేలు నుంచి 8వేలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. ఇప్పుడు వీరికి పెరిగిన జీతాలకు తోడు, ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో, చంద్రన్న భీమా కూడా తోడయ్యింది.