చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ఉత్పత్తిదారులను ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. తోతాపురి మామిడి కిలోకు రెండున్నర రూపాయల మేర ప్రభుత్వం రైతుకు చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యానవన రైతులను ఆదుకోవడానికి మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయించారు. దేశంలో ఇప్పటి వరకూ మామిడి రైతులను ఆదుకున్న మొట్టమొదటి ప్రభుత్వంగా ఏపీ నిలిచిపోతుంది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి కిలో కు రూ. 7.50 చొప్పున చిత్తూరు జిల్లాలోని 53 ప్రాసెంసింగ్ యూనిట్లు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం ఆదేశించింది. మామిడి ప్రాసెసింగ్ యూనిట్లు రూ.5 చెల్లిస్తాయి. కొనుగోళ్ళ వివరాలు అందిన తర్వాత కిలోకి రూ.2.50 చొప్పున ప్రభుత్వం ప్రాసెంసింగ్ యూనిట్లకు చెల్లిస్తుంది.
దీనికిగాను రాష్ట్రప్రభుత్వంపై సుమారు 45 కోట్ల భారం పడనుంది. చిత్తూరు జిల్లాలోని తోతాపురి మామిడి ఉత్పత్తిదారులకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఉల్లి, పసుపు, మిర్చి పంటలకు ధరలు పడిపోయినప్పుడు కూడా ప్రభుత్వం రంగంలోకి దిగి కొంత ధరను భరించింది. జులై 4 నుంచి 28వరకూ రైతులు తమ తోతాపురి మామిడి దిగుబడులను ప్రాసెంసింగ్ యూనిట్లకు తీసుకెళ్ళి అప్పగించవచ్చని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో అన్ని రకాల మామిడి దిగుబడులకు ధరలు ఆశాజనకంగా ఉండగా ఒక్క తోతాపురికి మాత్రం ధరలు బాగా పడిపోయాయి. దాంతో సంబంధిత రైతులకు అశనిపాతంగా మారింది.ఈ విషయం తెలుసుకున్న రాష్ట్రప్రభుత్వం తోతాపురి ఉత్పత్తి రైతుల కష్టాలు తీర్చడంలో తక్షణం స్పందించింది. తోతాపురికి చిత్తూరు జిల్లా ప్రసిద్ధి.
చిత్తూరు జిల్లాలో మొత్తం 97000 హెక్టార్లలో వివిధ రకాల మామిడి పంటలను పండిస్తున్నారు..అయితే 34000 హెక్టార్లలో మాత్రం తోతాపురి రకాన్ని పండిస్తున్నారు. గతంలో తోతాపురి కిలో ఒక్కింటికీ రూ.11 ఉంటుండగా ప్రస్తుతం అది రూ.4కు పడిపోయింది. దాంతో తోతాపురి రైతులకు తీవ్ర ఆవేదన కలిగించింది. హతాశులైన తోతాపురి మామిడి రైతుల కష్టాలను తీర్చడానికి రాష్ట్రప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన, వినూత్న తరహా చర్యలు తప్పకుండా వారిని ఒడ్డున పడవేస్తాయనడంలో సందేహం లేదు. జిల్లా కలెక్టరు పర్యవేక్షణలో ప్రాసెసింగ్ యూనిట్ల వద్ద రెవిన్యూ, ఉద్యానశాఖ అధికారుల సమక్షంలో కొనుగోళ్ళు జరుగుతాయి.