55 వేల విద్యుత్ రంగ ఉద్యోగులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపికబురు చెప్పారు. గురవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో పే రివిజన్ కమిటీ సిఫారసులకు ఆయన ఆమోద ముద్ర వేశారు. 2018-22 కాలానికి 25 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. దీని ద్వారా 15 సంవత్సరాలలోపు సర్వీసు ఉన్న వారికి రెండు వెయిటేజి ఇంక్రిమెంట్లు, 15 సంవత్సరాలకు పైగా సర్వీసులో ఉన్న వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల రూ.800 కోట్లు విద్యుత్ సంస్థలకు అదనపు ఖర్చు అవుతుందని, అయినా ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రతి విద్యుత్ ఉద్యోగి క్రమశిక్షణతో, బాధ్యతతో మెలిగి వినియోగ దారుడికి మెరుగైన సేవలు అందించాలని, విద్యుత్ రంగ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
మరో పక్క సంక్షేమ శాఖల సమీక్షలో చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు. పథకాల ఫలితాలు నిర్దేశిత వర్గాలకు చేరాలన్నారు. ఇందుకోసం రియల్ టైమ్ గవర్నెన్స్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని, 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వినతులను తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజలకు తెలియపర్చాలని, మనం దేనికైతే ఖర్చుపెడుతున్నామో ఆ పథకం ఫలవంతం కావాలని, ఫలితాలు లబ్దిదారులకు చేరాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ‘మనం చేసేది బాగానే చేస్తున్నాం. లబ్దిదారులకు ఒక కోరిక ఉంటుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాల ఫలితాలు తమకు చేరాలని భావిస్తారు. వాళ్ల కోరినది మనం చేయాలి. అత్యధికంగా సంతృప్తి రావాలి’ అని ముఖ్యమంత్రి సూచించారు.
ఇదిలా ఉంటే సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై జిల్లాల అధికారులతో ముఖ్యమంత్రి విడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ ఆర్డీఓతో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు గిరిజన కార్పొరేషన్ ఉత్సత్తులపై నాణ్యతలో రాజీ వద్దని, కర్ణాటక లాంటి పొరుగు రాష్ట్రాలు ఎలా విక్రయిస్తున్నాయి. ఎలా లాభాలు గడిస్తున్నాయో, ఆయా గిరిజన సహకార సంస్థల పనితీరును అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. కాగా 2017-18 లో సాంఘిక సంక్షేమ శాఖకు కేటాయించిన బడ్జెట్ రూ.3692.44. వ్యయం చేసిన మొత్తం రూ. 3144.21. (85%) గా ఉంది. 2018-19లో కేటాయించిన మొత్తం రూ.4278.78 కోట్లు. 2017-18లో గిరిజన సంక్షేమానికి కేటాయించిన మొత్తం రూ. 1815.33 కోట్లు కేటాయించగా రూ.1724.44 కోట్లు (95%) వ్యయం చేశారు. 2018-19లో రూ. 2129.13 కోట్లు మంజూరు చేశారు. ఇక బి.సి సంక్షేమానికి కేటాయించింది రూ.5015.70 కోట్లుకాగా,అ దులో రూ. 4916.23 కోట్లు (98%) వ్యయం చేశారు. 2018-19లో రూ.6213.16 కోట్లు కేటాయించారు