హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడులో రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు త్వరలోనే శుభవార్త వింటారని తీపికబురు అందించారు. అనంతరం తాళ్లాయిపాడులో ఎన్టీఆర్ గృహాలను సీఎం ప్రారంభించారు. గత కొంత కాలంగా, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు అనేక పర్యాయాలు అందోళన చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటాం అని హామీ ఇచ్చింది. దీని పై అతి త్వరలోనే శుభవార్త వింటారని, ఇప్పుడు చంద్రబాబు ప్రకటించారు.
మరో పక్క, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీపికబురందించింది. ఉద్యోగుల పీఆర్సీ బకాయిల కింద తక్షణం రూ.269 కోట్లు విడుదల చేసింది. మిగిలిన మొత్తం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1710 కోట్ల బకాయిలు మూడు కేటగిరీలుగా ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే పెన్షనర్లకు 100 శాతం చెల్లింపులకు రూ. 715 కోట్లు విడుదల చేసింది. దీని వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.3,919 కోట్ల భారం పడుతుంది. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి.
విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పీఆర్సీ-2018ని ప్రకటించడం హర్షణీయమని ఏపీ ఎలక్ట్రిసిటీ పర్సనల్ అండ్ జనరల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఎస్.వి.వి.ప్రసాద్ అన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు, ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ట్రాన్స్‌కో ఎండీ అండ్ జెన్‌కో ఎండీ విజయానంద్, జేఎండీలు పరుచూరి దినేష్, ఉమాపతిలకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి అన్ని సర్వీసుల్లోని ఫీడర్ కేటగిరీ పోస్టుల భర్తీకి సానుకూలంగా స్పందించి తక్షణం ఆదేశాలు ఇవ్వడం ఆనంద దాయకం అన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా పనితీరు మెరుగుపరిచి విద్యుత్ సంస్థల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.