వైసీపీ పార్టీలో, అందరూ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్నే ఏకీభావిస్తారని, ఎవరూ ఎదురు చెప్పే పరిస్థితి ఉండదు అంటూ, ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అధికారంలో ఉండటం, బలంగా 151 మంది ఉండటంతో, జగన్ నిర్ణయాలకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చెయ్యరు. రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు, ఎదురు తిరిగినా, ఇలాంటివి కనిపించకుండా జాగ్రత్త పడతారు. అయితే, ఇప్పుడు మూడు రాజధానులు విషయంతో, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ, ప్రజలను బిజీగా ఉంచుదాం అనుకుంటే, ఇప్పుడు సొంత పార్టీ నేతలు కూడా ఆ చిచ్చులో చిక్కుకున్నారు. ముఖ్యంగా ప్రజలు తిరగబడటంతో, పార్టీ కంటే, జగన్ కంటే, ప్రజల అభిప్రాయలను గౌరవించాల్సిన పరిస్థితి. అసెంబ్లీ వేదికగా, జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుంది అని చెప్పారు. అయితే ఈ ప్రకటన పై అమరావతి ప్రాంత రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్త్యం అయ్యింది.
అలాగే ఈ ప్రాంతంలో ఉండే లాయర్లు కూడా ఎదురు తిరిగారు. ఇది అమరావతి రైతుల నుంచి, కోస్తా, గోదావరి జిల్లాలకు కూడా పాకుతుంది. ఇక్కడ ప్రజలు కూడా, మేము రాజధాని ఉంది అని, మాకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ రాకపోయినా, ఊరుకున్నాము, కియా లాంటివి అనంతపురంలో వస్తే సంతోషించాము, ఇప్పుడు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు అనే భావనకు వచ్చారు. అయితే ప్రజల అభిప్రాయాలకు లొంగక తప్పని పరిస్థితి వైసీపీ ఎమ్మెల్యేలది. దీంతో, జగన్ మూడు రాజధానుల ప్రకటనను తప్పుబట్టారు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అసలు మూడు రాజధానులు అనేది సమంజసం కాదని, అమరావతిలోనే రాజధాని ఉంచాలని, ఇది తన సొంత అభిప్రాయమని అన్నారు.
అసెంబ్లీ, సెక్రటేరియట్ ఒకే చోట ఉండాలని, అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖలో ఎలా ఉంచుతారు అంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ రెండూ కూడా ఒక్కచోటే ఉండాలని, ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్పుకొచ్చారు. త్వరలోనే జగన్ మొహన్ రెడ్డిని కలిసి, తన అభిప్రాయాన్ని ఆయనకు తెలియజేస్తానని వెల్లడించారు. ఇదే సమయంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చి నష్టపోయామని, మరోసారి ప్రజలు నష్టపోవడం భావ్యం కాదని అవేదన వ్యక్తం చేసారు. ఇంకా నిపుణుల కమిటీ నివేదిక రాలేదని, అది వచ్చేదాకా, ప్రజలు అపోహలు పడవొద్దని సూచించారు. మొత్తానికి అధికార పార్టీలోనే భిన్నాభిప్రాయాలు రావటం, ఇప్పుడు సంచలనంగా మారింది.