ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల నిర్వహణ పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. తెలంగాణా, తమిళనాడుతో పాటుగా, వివిధ రాష్ట్రాలు, పదవ తరగతి పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ పరిస్థతి ఏమిటి అని అందరూ ఎదురు చూస్తున్న వేళ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, చత్తీస్ గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదోతేదీ నుంచే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లకు కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలతో పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రతలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన పై, పలువురు అభ్యంతరం చెప్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా తీసుకోవల్సిన అనేక జాగ్రత్తల్లో భాగంగా పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వైఎస్ జడగన్మోహన రెడ్డికి ఏపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజా నాథ్ బుధవారం లేఖ రాశారు. జూలై -పదవ తేది నుంచి పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ప్రకటించడం కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన లేఖలో కోరారు. ఇప్పటికే తెలంగాణా, తమిళనాడు ప్రభుత్వాలు పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తు తీసుకున్న నిర్ణయాన్ని ఆయన జగన్ దృష్టికి తీసుకు వెళ్లారు. పరీక్షలను రద్దు చేసి విద్యార్థులు అందరిని పై తరగతులకు ప్రమోట్ చేయాలని కోరారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని, ప్రభుత్వం వెంటనే తగు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని తమ పార్టీ భావిస్తోందని లేఖలో శైలజానాథ్ పేర్కొన్నారు.