ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉన్నట్టు ఉండి, విజయవాడ రావటం, జగన్ ను పిలిపించుకుని, దాదపుగా గంట సేపు మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గవర్నర్ నరసింహన్ ఏదన్నా అధికారిక కార్యక్రమం ఉంటే తప్ప విజయవాడ రారు. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి కాని, ప్రతిపక్షానికి కాని, అధికారులకు కాని ఏదన్నా పని ఉన్నా, హైదరాబాద్ వెళ్లి గవర్నర్ ను కలవాల్సిందే. మరి అలాంటిది గవర్నర్ పని గట్టుకుని, ఏ అధికారిక కార్యక్రమం లేకపోయినా, విజయవాడ వచ్చి, జగన్ ను పిలిపించుకుని గంటన్నర పైగా మాట్లాడటం చూస్తుంటే, ఎదో సీరియస్ విషయమే నడుస్తుందని, రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే బయటకు మాత్రం, ఈ నెల 11 నుంచి జరిగే బడ్జెట్ శాసనసభా సమావేశాల పై మాట్లాడటానికి గవర్నర్ వచ్చారని చెప్తున్నారు. బడ్జెట్ లో కేటాయింపులు, అధిక ప్రాధాన్యత ఇచ్చే విషయాల పై చర్చలు జరిగినట్టు చెప్తున్నారు.
అయితే గతంలో గవర్నర్ ఇలా చేసింది ఎప్పుడూ లేదని, అయినా ఇప్పటికే గవర్నర్ ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంకా ప్రత్యేకంగా బడ్జెట్ సమావేశాల పై చర్చించేందుకు గవర్నర్ వచ్చారు అని చెప్పటం, నమ్మసక్యంగా లేదని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తున్నారనే ప్రచారం నేపధ్యంలో గవర్నర్ ఎమన్నా ముందే జగన్ ను కలిసారా ? లేక తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం పై బీజేపీ చేస్తున్న రాజకీయ దాడి, కేసీఆర్ కోటరీ పై ఐటి దాడుల నేపధ్యంలో, జగన్ కు కూడా ముందస్తుగా ఏదన్నా జాగ్రత్తలు చెప్పటానికి కలిసారా అనే వాదన వినిపిస్తుంది. లేకపోతే కేంద్రం నుంచి ఏదయినా సందేశం వచ్చిందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది. నిజానికి నరసింహన్ వ్యక్తిగత పని మీద చెన్నై వెళ్లారు. అయితే ఆదివారం రాత్రికి రాత్రి హైదరాబాద్ వచ్చి, సోమవారం ఉదయమే విజయవాడ వచ్చారు. కేవలం జగన్ తో చర్చలు జరిపి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయారు.