ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నవ్యాంధ్రకు కేటాయించిన భవనాలన్నిటినీ తిరిగి తెలంగాణకు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా అయిన ఆదివారం రాత్రి గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ అధీనంలో ఉన్న భవనాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని తిరిగి తమకు అప్పగించాలంటూ తెలంగాణ కేబినెట్‌ చేసిన తీర్మానంపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన విషయం తెలిసిందే. నవ్యాంధ్ర పాలనకు వీలుగా సచివాలయంలోని సగం బ్లాకులతోపాటు ప్రభుత్వ భవనాలను చెరి సగం కేటాయిస్తూ అప్పట్లో గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారు.

narasimhan 03062019

అయితే, వాటిలో ఎల్‌ బ్లాకులోని కొన్ని గదులను మినహా మిగిలిన వాటిని ఏపీ ప్రభుత్వం ఉపయోగించడం లేదు. దాంతో, మీరు ఉపయోగించుకునే వాటిని ఉంచుకుని, మిగిలిన వాటిని తమకు ఇచ్చేయాలని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. భవనాల అప్పగింతపై గతంలో కూడా తెలంగాణ మంత్రివర్గం తీర్మానం చేసి, గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, ఏపీలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవనాల అప్పగింతకు సానుకూలత వ్యక్తమైంది. శనివారం రాజ్‌భవన్లో ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు ముందు కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గవర్నర్‌ సమావేశమైన విషయం తెలిసిందే. విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ తర్వాత 15 నిమిషాలపాటు ఇరువురు సీఎంలు ముఖాముఖి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భవనాల అప్పగింతకు ఏపీ సీఎం జగన్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

narasimhan 03062019

‘ఏపీ అధీనంలో ఉన్న భవనాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించండి’ అని తెలంగాణ మంత్రివర్గం ఆదివారం గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు అందుబాటులో ఉన్న మంత్రులతో తీర్మానంపై సంతకం చేయించారు. అనంతరం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. తీర్మానం ప్రతిని అందజేశారు. సచివాలయంతోపాటు మరికొన్ని భవనాలు ఏపీ అధీనంలో ఉన్నాయని గుర్తు చేశారు. ఖాళీగా ఉండడం వల్ల ఎలుకలు వైరింగ్‌ను కత్తిరించడం.. చెత్తాచెదారం పెరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని నివేదించారు. అనంతరం గవర్నర్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారు. అయితే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వద్దకు, ఇది రాగా, ముందుగా ఉమ్మడి ఆస్తులు, కరంట్ బకాయులు విషయం తేలిస్తే కాని, ఈ భవనాలు ఇవ్వం అంటూ ఏపి ప్రభుత్వం తరుపున చెప్పారు. కాని, ఇప్పుడు ప్రభుత్వం మారటంతో, జగన్, కేసిఆర్ విజ్ఞప్తి మేరకు తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్కయ్యారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read