ఆంధ్రప్రదేశ్ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజకీయ చర్చకు దారి తీసింది. సహజంగా గవర్నర్ లు, ప్రభుత్వాలు పంపే ఫైల్ ని ఆమోదించి పంపిస్తారు. ఎంత వివాదం ఉన్న బిల్లు అయినా, ప్రభుత్వం ఒకే చెప్పిన తరువాత, సహజంగా వెనక్కు తిప్పి పంపించరు. అమరావతిని మూడు ముక్కలు చేసే బిల్లులు అయినా, అలాగే నిమ్మగడ్డ రమేష్ ని తొలగించి వేరే వారికి ఎలక్షన్ కమీషనర్ ను నియమించే బిల్లు అయినా, ఎంత వివాదాస్పదం అయినా, గవర్నర్ ని ఆమోదించవద్దు అని వేడుకున్నా, ఆయన ఆ బిల్లులను ఆమోదించారు. రాజధాని బిల్లులను వెంటనే ఆమోదించకుండా, కొంచెం టైం తీసుకుని, న్యాయ సలహాలు తీసుకున్న టైంలో, ఎక్కడ గవర్నర్ వాటిని వెనక్కు పంపుతారో అని, ఏకంగా మంత్రి బుగ్గన లాంటి వారిని కూడా గవర్నర్ వద్దకు పంపించి, ఆ బిల్లుల అవసరం గురించి వివరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు గవర్నర్, ఏపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయనకు ఉన్న పరిధిలో, విచక్షణాదికారం ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకున్నారు. అయితే మొదటి సారి గవర్నర్, ఏపి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లును నియమించే విషయంలో, ప్రభుత్వం గవర్నర్ వద్దకు ఫైల్ పంపగా, గవర్నర్ ఆ ఫైల్ ని వెనక్కు తిప్పి పంపించారు. జగన్ ప్రభుత్వానికి, గవర్నర్ వద్ద నుంచి షాక్ రావటం ఇదే మొదటి సారి. అయితే ఈ నియామకాలు యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే వెనక్కు పంపినట్టు తెలుస్తుంది.
గత 20 రోజులుగా ఈ ఫైల్ గవర్నర్ వద్దే ఉంది. గవర్నర్ ఈ ఫైల్ పై న్యాయ సలహాలు, నిపుణుల సలహాలు తీసుకున్నారు. దీపావళి ముందు రోజు, జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసిన సందర్భంలో, ఈ ఫైల్ పై కూడా గవర్నర్ వద్ద ప్రస్తావించినట్టు, వీలైనంత త్వరగా ఆమోదం తెలపలాని కోరినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ నియామకాలు విరుద్ధంగా ఉండటంతో, గవర్నర్ తిప్పి పంపారు. సహజంగా ఒక యూనివర్సిటీ వీసిని నియమించే క్రమంలో, సెర్చ్ కమిటీ ముగ్గురు వ్యక్తులతో ఒక ప్యానెల్ ను రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది, అందులో నుంచి ఒకరిని గవర్నర్ నియమిస్తారు. అయితే ఈ మధ్య కొత్త చట్టం తీసుకు వచ్చిన జగన్ ప్రభుత్వం, ఆ ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వమే నిర్ణయిస్తుందని ఒక చట్టం తెచ్చింది. అయితే ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం అని, ప్రభుత్వ పాత్ర ఈ నియామకాల్లో ఉండ కూడదు అని, గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు మార్పులు పై కోర్టులో కేసులు కూడా పడ్డాయి. అయితే ఇక్కడ గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కూడా ప్రాముఖ్యంగా మారింది. ఇక నుంచి ప్రతి బిల్లు గవర్నర్ ఆషామాషీగా ఆమోదించరు అనే సంకేతాలు ఇచ్చినట్టు అయ్యింది.