చుక్కల భూములకు సంబంధించి ప్రభుత్వ ఆర్డినెన్స్‌పై వివరణ కోరుతూ గవర్నర్ నరసింహన్ ఫైల్ వెనక్కి పంపారు. దరఖాస్తుకు కనీస పరిష్కార సమయం 2 నెలలు పెట్టడంపై ఆయన అభ్యంతరం తెలిపినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు రెండు ఆర్డినెన్సులు పంపగా వాటిలో ఒకదానికి ఆమోదం తెలిపి మరోదానిపై వివరణ కోరారు. ఏపీ అసైన్మెంట్ ల్యాండ్‌కు ఆమోదం తెలిపిన గవర్నర్ 20 ఏళ్ల వరకు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఎవరికీ అమ్ముకోకుండా ఉండే నిబంధనకు అంగీకారం తెలిపారు. చుక్కల భూములపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆర్డినెన్స్‌కు ఆస్కారం లేదనే అభిప్రాయం గవర్నర్ వ్యక్తంచేసినట్లు తెలిసింది.
మరి అసెంబ్లీ జరుగుతున్నప్పుడే మరో ఆర్డినెన్స్‌కు ఎలా ఆమోదం తెలిపారనే చర్చ ప్రభుత్వవర్గాల్లో నడుస్తోంది. ఒక ఆర్డినెన్స్ ఆమోదం తెలిపి, ఇంకొకటి వెనక్కు ఎలా పంపిస్తారని ప్రభుత్వ వర్గాలు గవర్నర్ ఆఫీస్ ని అడగ్గా, అసైన్మెంట్ ల్యాండ్ దస్త్రం అసెంబ్లీ నోటిఫికేషన్‌కు ముందు వచ్చిందని, చుక్కల భూముల దస్త్రం అసెంబ్లీ షెడ్యూల్ వెలువడ్డాక వచ్చిందన్నది గవర్నర్ కార్యాలయ వర్గాల భావనగా తెలుస్తోంది. చుక్కల భూముల బిల్లుకు సంబంధించి గవర్నర్ ఆమోదంతో సంబంధం లేకుండా నేరుగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ ఇబ్బందులు పెడుతూ ఉండటంతో, నేరుగా అసెంబ్లీలోనే బిల్ చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది.
సోమవారం ఉదయం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో ఇదే విషయం పై అధికారులను హెచ్చరించారు చంద్రబాబు. ‘చుక్కల భూముల సమస్యలు పరిష్కరించమంటే మాకు చుక్కలు చూపిస్తున్నారు. భూమి రైతుదే అయినా, మీరిచ్చిన ఉత్తర్వులతో సమస్యలు తెచ్చిపెట్టారు. సాంకేతిక కారణాలు చూపి కొత్త సమస్యను సృష్టించొద్దు’ అని సీఎం రెవెన్యూ అధికారులను సున్నితంగా హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో 99శాతం సమస్యలు పరిష్కరించామని కలెక్టర్ శశిధర్ చెప్పగా సీఎం ఆయన్ను అభినందించారు. కర్నూలు, కడప తదితర జిల్లాల కలెక్టర్లు కూడా ప్రగతిని వివరించారు. ‘ఇవన్నీ వాస్తవంగా పరిష్కరించినవేనా? ఆమోదించినవెన్ని?’ అని సీఎం ప్రశ్నించారు. సర్వేనంబర్లను జాబితాల నుంచి తొలగించడమే పరిష్కారమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు తెలిపారు. గుంటూరు కలెక్టర్ అవలంబించిన విధానాలను పరిశీలించి రావాలని సీఎం ఆయనకు సూచించారు.