ఈ రోజు అసెంబ్లీలో అరుదైన సన్నివేసం కనిపించింది. కేంద్రానికి సన్నిహితుడుగా ఉన్న గవర్నర్ చేతే, అదే కేంద్రాన్ని తిట్టించారు చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా, ఏపి ప్రభుత్వం ఇచ్చిన సందేశం చదువుతూ, కేంద్రం చేసిన మోసం, దగా, గవర్నర్ నోటి వెంటే వచ్చేలా చేసారు చంద్రబాబు. రాష్ట్రం విభజన నష్టాల నుంచి కోలుకుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నాలుగున్నరేళ్లలో విభజనహామీలతో పాటు ప్రత్యేకహోదా అమలుకాలేదని చెప్పారు. అవినీతి రహిత పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు
పొరుగు రాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఏపీ చేరే వరకూ కేంద్రం చేయూత అవసరమని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చిన రూ.350 కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం ఊహించని పరిణామమని ఆయన అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం అభివృద్ధికి తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. కేంద్రం సహాయ నిరాకరణకు పాల్పడుతూ తోడ్పాటు అందించడం లేదని.. సహకరించకపోయినా ఆదర్శంగా నిలవడం ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని చెప్పారు. సగటున రాష్ట్ర వృద్ధిరేటు 10.66గా ఉందన్నారు. ఎన్టీఆర్ భరోసా కింద 2014-15 నుంచి 2018-19 వరకు రూ.24,618.39 కోట్లు పంపిణీ చేశామని గవర్నర్ నరసింహన్ చెప్పారు.
విభజన హామీలపై కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ఏపీ విభజన అసంబద్ధంగా జరిగిందని, ఏపీకి ఇస్తామన్న హోదా కేంద్రం ఇవ్వలేదన్నారు. విభజన కారణంగా ఏపీ ఎంతో నష్టపోయిందని ఆయన తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మౌలిక, సేవా రంగాల్లో ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. 10 అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేశామని, పారదర్శక పాలన అందిస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. సాగునీటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఈ నాలుగున్నరేళ్లలో రూ.64,333 కోట్లు ఖర్చు చేసిందని.. దీంతో 32 లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చాయన్నారు.