కరోనా వ్యాప్తి నేపధ్యంలో నిత్యావసర వస్తులు పూర్తిగా అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల కదలికలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు. ఇంటింటి సర్వే ద్వారా కరోనా ఇతరులకు వ్యాపించకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకునట్టు ప్రభుత్వం చెప్పిందని అన్నారు. కరోనా వ్యాప్తికి సంబంధించి భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ శుక్రవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్న సమావేశంలో రాష్ట్రపతి కోవింద్ ఎంపిక చేసిన రాష్ట్రాల గవర్నర్లతో మాట్లాడుతూ సామాజిక దూరం పాటించడం ద్వారా మాత్రమే కరోనాను కట్టడి చేసే అవకాశం ఉందన్నారు. ఇందుకు అనుగుణంగా గవర్నర్లు వ్యవహరించాలని పేర్కొన్నారు.
కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా దేశం యావత్ తగిన సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని, ఇదే సమయంలో ఒంటరిగా సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమకున్న అనుభవంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేయాలన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ప్రార్ధనల పేరిట సమావేశాల నిర్వహణకు దూరంగా ఉండేందుక సమతపెద్దలు ప్రజల్లో అవగాహన కలిపించాలన్నారు. వ్యాధి నియంత్రణకు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. టెస్ట్ ట్రేస్, ఐసోలేట్ అండ్ టీ అనే మంత్రం అన్ని రాష్ట్రాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. నిత్యావసర వస్తువుల సరఫరా, విద్యార్థులకు ఆహార లభ్యత, వలస కూలీలకు ఆహారం అందించేందుకు ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
వివిధ సంస్థలు, ప్రైవేటు రంగం సేవలను విరివిగా వినియోగించుకోవాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్ తదుపరి రాజ్ భవన్ నుంచి జారీ చేసిన ప్రకటనలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇతర స్వచ్చంధ సంస్థల పాత్రను సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ విశ్వభూషణ్ పేర్కొన్నారు. యాచకులు, నిరాశ్రయులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంలో ప్రభుత్వం తగిన సహాయం అందించాలన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్ట్ నెంట్ గవర్నర్లతో అనుభవాలను పంచుకోవడం ఉపయోగంగా ఉందన్నారు. ఈ తరహా సమావేశాల వలన అందరి అనుభవాలను క్రోడీకరించి మెరుగైన సాయం అందించేందుకు సహకరిస్తుందని గవర్నర్ అభిప్రాయపడ్డారు.