అమరావతి విషయంలో కేసులు రోజు వారీ విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, అమరావతిలోని సెక్రటేరియట్, రాజ్ భవన్, అసెంబ్లీ, సియం కార్యాలయం, ఇతర డిపార్టుమెంటులు, కార్పొరేషన్ భవనాలు, విశాఖకు తరలించకుండా, ఇక్కడే ఉంచాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే మిగతా భవనాలు ఇప్పుడు తరలించే ఉద్దేశం మాకు లేదని ప్రభుత్వం తెలిపింది. అయితే సియం క్యాంప్ కార్యాలయం ఎక్కడైనా పెట్టుకునే హక్కు మాకు ఉందని, అలాగే వివిధ కార్పొరేషన్ ఆఫీస్ లు ఇప్పటికే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపింది. పలానా చోటు మాత్రమే క్యాంపు కార్యాలయం ఉండాలని ఎక్కడా లేదని, కోర్టుకు తెలపటంతో, దీనికి సంబంధించిన మొత్తం వివరాలు తమకు సమర్పించాలని, కోర్టు ఆదేశించటంతో, రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు నిన్న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సియం క్యాంప్ ఆఫీస్ లు అయినా పెట్టుకునే హక్కు ఉందని అన్నారు. జిల్లాకి ఒకటి అయినా పెట్టుకోవచ్చని ఆయన తన కౌంటర్ లో తెలిపారు. క్యాంప్ కార్యాలయం అమరావతిలోనే ఉండాలి, మరెక్కడా ఉండకూడదు అనే హక్కు పిటీషనర్ కు లేదని ఆయన కౌంటర్ లో తెలిపారు.

క్యాంప్ ఆఫీస్ ఒక్క చోటే ఉండాలనే చట్టం ఎక్కడా లేదని, సిఆర్డీఏ చట్టంలో కూడా, ఈ నిర్వచనం ఎక్కడా లేదని తెలిపారు. ఇప్పుడు ఉన్న చోటు నుంచే ముఖ్యమంత్రి ఉండాలని, అక్కడ నుంచి వేరే చోట పెట్టకూడదు అనే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. అందుకే ఈ పిటీషన్ ను కొట్టేయాలని తమ కౌంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని కోరింది. ఈ పిటీషన్ పై రేపు విచారణ జరగనుంది. ఇక మరో పక్క కార్పొరేషన్ల విషయంలో కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది కాబట్టి, మిగతా కార్యాలయాలు తరలించటం లేదని, కార్పొరేషన్ల విషయంలో, ఇప్పటికే అనేక చోట్ల ఇవి ఉన్నాయి కాబట్టి, వాటికి ఇవి వర్తించదని, గుంటూరు, కృష్ణాలో ఉన్న కార్పొరేషన్ ఆఫీస్ లకే, ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి అంటూ, ఆ కార్పొరేషన్ ల లిస్టు ని, హైకోర్టుకు సమర్పించారు. అమరావతి రాజధాని తరలింపు పిటీషన్ల పై రేపు, మరోసారి విచారణ జరగనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read