ఆగష్టు ఒకటితో సర్పంచ్ ల పదవీకాలం ముగుస్తుందని,ఆ గడువు లోపే తదుపరి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ పంచాయతీలకు వచ్చే సాధారణ ఎన్నికలలోపు ఎన్నికలు జరుగుతాయో లేదో అని సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతున్నది. ఇందులో భాగంగా పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి తన యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం ప్రారంభించారు. ఆగస్టు 1వ తేదీతో సర్పంచ్ల పదవీ కాలం ముగియబోతున్నది. ఈ లోపుగానే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్తో శనివారం ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించారు.
ఇక త్వరితగతిన పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రకటించాల్సి ఉంది. అలాగే నెలాఖరులోపు వార్డుల వారీగా రిజర్వేషన్లు కూడా ప్రకటించాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే జూలై మాసంలోనే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలకు ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు తగిన విధంగా రాష్ట్రంలో కసరత్తు జరుగుతుంది. దీనిలో తొలి అంకమైన ఓటర్ల జాబితా ప్రచురణ షెడ్యూల్ ప్రకారం అన్ని పంచాయతీల్లో వార్డుల వారీగా ప్రదర్శిం చాల్సి ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు దాదాపు అన్ని పంచాయతీల్లోనూ జరుగుతున్నాయి.
ఒక వేల ఆగష్టు దాటితే, ప్రస్తుత పాలక వర్గాల పదవీ కాలం ముగిశాక అన్ని పంచాయితీలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ఒకటితో పాలకవర్గాల పదవీ కాలం ముగుస్తోంది. అంటే రెండు నుంచి కొత్త పాలక వర్గాలు రావాల్సి ఉంటుంది. ఈ లోగా ఎన్నికలు జరిగితేనే అందుకు అవకాశం ఉంటుంది. దీనిపై సందిగ్ధం నెలకొనడంతో పంచాయితీలలో హడావుడి మొదలైంది. "ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సామాజిక స్థితి నమోదుతోనే ప్రచురణ చేయడం జరిగేది. ఈ సారి కేవలం ఓటర్ల జాబితాలు మాత్రమే పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు జిల్లాలో ఓటర్ల జాబి తాలు తయారు చేస్తాం." అని అధికారులు అంటున్నారు.