అది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన అమరావతి కేసు. గతంలో ఇదే అమరావతిలో బురద చల్లి, రాజకీయంగా లబ్ది పొంది అధికారంలోకి రావటానికి, ఈ అంశం కూడా బాగా ఉపయోగపడింది అనే విశ్లేషణ కూడా ఉంది. అందుకే ఈ అమరావతిని ఇంకా బూచిగా ప్రజల ముందు పెట్టటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అన్నీ పటాపంచలు అవుతూ, ఒక్కోటి పోయి, అమరావతి పునీతమై బయటకు వస్తుంది. అయినా ఏదో ఒక బురద వేస్తూనే ఉన్నారు. ఇదే కోవలో ఇప్పుడు అమరావతి కేసు ఒకటి సుప్రీం కోర్టులో ఉంది. గతంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటుగా, కొంత మంది జడ్జిల పిల్లల పై కూడా ఆరోపణలు మోపి, ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఒక జడ్జికి మంచి పదవి రాకుండా చేయకుండా ఉండేందుకే, ఈ ఆరోపణలు చేస్తున్నారు అనే విమర్శలు కూడా వచ్చాయి. ఇది చాలా పెద్ద రచ్చ అయ్యి, చివరకు ఏ జడ్జిని అయితే పదోన్నతి రాకుండా చేద్దామని అనుకున్నారో, ఆ జడ్జికి ఆ పదవి కూడా వచ్చింది. అయితే ఈ ఎఫ్ఐఆర్ వేయటం, వారి పేర్లు చెప్పి అల్లరి చేస్తూ ఉండటంతో, వెంటనే దీని పై హైకోర్టుకు వెళ్ళగా, హైకోర్టు స్టే ఇవ్వటమే కాకుండా, ఎఫ్ఐఆర్ ని కూడా కొట్టేసింది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళింది.
ఈ కేసు సుప్రీం కోర్టులో దాదాపుగా ఏడు నెలల నుంచి ఉంది. కొన్ని వాయిదాలు కూడా జరిగాయి. అయితే ఏపి ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి కౌంటర్ ఈ పిటీషన్ మీద పడలేదు. నిన్న ఉన్నట్టు ఉండి, ఈ కేసుని మేము హైకోర్టులోనే తేల్చుకుంటాం, ఈ పిటీషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుని కోరింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలలుగా ఎందుకు కౌంటర్ వేయలేదు, ఇప్పుడు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారు అని, సుప్రీం కోర్టు ప్రశ్నించగా, తమకు ఇప్పుడే జ్ఞానోదయమైంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరుపు న్యాయవాది కోర్టుకు సమాధానం చెప్పారు. అయితే ఇదే సందర్భంలో, వైరి పక్షం లాయర్ మాట్లాడుతూ, కౌంటర్ త్వరగా వేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరగా, ఎందుకు చేయరు, ఆరేడు నెలల తర్వాత వారికి జ్ఞానోదయమైంది అంటూ న్యాయమూర్తి చమత్కరించారు. అయితే అసలు ఈ అమరావతి కేసులో ఏమని జ్ఞానోదయమైందో ఏంటో, మరి హైకోర్టులో ప్రభుత్వం ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందో చూడాలి మరి.