విజయవాడ నగర పోలీసు కమీషనర్ గౌతం సవాంగ్ బదిలీ అయ్యారు. ఆయన్ను విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొన్నటి దాకా గౌతం సవాంగ్ రాష్ట్ర పోలీసు బాస్‌గా నియమితులు కానున్నారని ప్రచారం జరిగింది. డీజీపీగా తనను నియమిస్తారని ఆయన విశ్వాసంతో ఉన్నారు. డీజీపీ పదవికి గౌతం సవాంగ్‌తో పాటు ఆర్‌పిఠాకూర్ పోటీపడ్డారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారని పోలీసు ఉన్నతాధికారుల్లో ప్రచారం జరిగింది. కాని చంద్రబాబు చివరకు డీజీపీగా ఆర్‌పి ఠాకూర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో విజయవాడ నగరపోలీసుల్లో కొంత నిరాశ అలుముకుంది. గౌతం సవాంగ్ కూడా అప్పటి నుంచి కొంత అన్యమనస్కంగా ఉన్నారు.
అయితే, ఇప్పుడు గౌతం సవాంగ్ కు కొత్త బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసు కమిషనర్‌గా చేస్తున్న గౌతం సవాంగ్‌ను విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీగా నియమించారు. సవాంగ్ స్థానంలో విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్ గా, సీహెచ్ ద్వారకాతిరుమల రావు కొత్త సీపీగా వచ్చే అవకాశం ఉంది. ఈయన ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. సమర్థుడైన అధికారిగా ద్వారకా తిరుమలరావుకు పేరు ఉంది. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో సైబరాబాద్ కమిషనర్‌గా పనిచేశారు. అంతకు ముందు అనంతపురం, మెదక్, కడప ఎస్పీగా, అనంతపురం రేంజి డీఐజీగా అక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
సీఐడీ అదనపు డీజీగా క్లిష్టమైన కేసులను కొలిక్కి తేవడంలో ఈయన సమర్థంగా పనిచేశారన్న పేరు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావును విజయవాడ పోలీసు కమిషనర్‌గా నియమించేందుకు ఇంటెలిజెన్స్ చీఫ్‌తోపాటు కొత్త డీజీపీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. వీరి ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఒకటి రెండు రోజుల్లో విజయవాడకు కొత్త పోలీసు బాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజధాని ప్రాంతమైన విజయవాడ శాంతిభద్రతల పరంగా చాలా సున్నితమైన స్థానం. అంతే కాదు, ఇంకా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటన్నింటినీ గాడిలో పెట్టాలంటే సమర్థుడైన అధికారిని కమిషనర్‌గా నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ద్వారకా తిరుమలరావు పేరు తెరపైకి వచ్చింది.