హిందీ మాట్లాడే వలస కార్మికులపై గుజరాత్‌లో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం కూడా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉత్తరాది కార్మికులపై దాడులు జరిగాయి. దీంతో బాధితులు వేలాదిగా వలస వెళ్తున్నారు. రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సబర్‌కాంతా జిల్లాలో గత నెల 28న 14 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో బిహార్‌కు చెందిన కార్మికుడ్ని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో స్థానికులు హిందీ మాట్లాడేవారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో పారిశ్రామిక ప్రాంతాలు, వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పోలీసులు గస్తీని ముమ్మరం చేశారు.

gujarat 10102018 1

వలస కార్మికుల్లో భరోసా కల్పించేందుకు వడోదరలో మంగళవారం వందల మంది పోలీసులు కవాతు చేశారు. హింసాత్మక ఘటనలపై 61 కేసులు నమోదయ్యాయని, 533 మందిని అదుపులోకి తీసుకున్నామని రాష్ట్ర మంత్రి ప్రదీ్‌పసిన్హ్‌ జడేజా తెలిపారు. సోషల్‌ మీడియాలో ద్వేషపూరిత సందేశాలు పంపుతున్న 20 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మరోవైపు ఈ అంశంపై అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పరస్పరం తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలే హింసను ప్రేరేపిస్తున్నారని ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆరోపించారు. వరస ట్వీట్లలో ఆయన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు.

gujarat 10102018 1

‘కాంగ్రెస్‌ నేతలే తొలుత హింసను ప్రేరేపిస్తారు. ఆ హింసను ఖండిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు ట్వీట్‌ చేస్తారు’ అని మండిపడ్డారు. సమస్యకు పరిష్కారం ట్వీట్‌ చేయడం కాదని.. బాధ్యులైన కాంగ్రెస్‌ నేతలపై చర్యలు తీసుకోవడమని హితవు పలికారు. వలస కార్మికులపై దాడులకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అల్పేష్‌ ఠాకూరే కారణమని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఆయన మాత్రం యూపీ, బిహార్‌కు చెందిన కార్మికులు ఛాఠ్‌ పూజ కోసమే సొంత ప్రాంతాలకు వెళుతున్నారని చెప్పడం గమనార్హం. కాగా.. గుజరాత్‌లోని బీజేపీ సర్కారు వైఫల్యం వల్లే ఉత్తరాదికి చెందిన కార్మికులపై దాడులు జరుగుతున్నాయని మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read