గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు వచ్చే సోమవారం విచారణ జరపనుంది. 2002లో గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారీ ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ అల్లర్ల వెనుక అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ, ఇతరుల కుట్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. కాగా ప్రత్యేక దర్యాప్తు బృందం మోదీ సహా 58మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. 2017 అక్టోబరులో గుజరాత్ హైకోర్టు వారికి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సమర్థించింది. అయితే మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రి భార్య జకియా జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కూడా సిట్ దర్యాప్తు నివేదికను, కోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 68ఏళ్ల ఇషాన్ జాఫ్రి 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లో జరిగిన గుల్బర్గా ఊచకోతలో చనిపోయారు. 2006లో ఆయన భార్య జకియా జాఫ్రి నరేంద్ర మోదీపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టు గుల్బర్గా ఊచకోత సహా 9 అల్లర్ల కేసులను తిరిగి విచారణ జరపాలని ఆదేశించింది. 2009 ఏప్రిల్ 27న జకియా ఫిర్యాదును పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం సిట్‌ను ఆదేశించింది. మోదీ కుట్ర పన్నారనడానికి ఆధారాలేమీ లేవని చెప్తూ 2012 మార్చిలో సిట్ నివేదిక ఇచ్చింది.
2008లో సిట్ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010లో మోదీని సిట్ 9 గంటలకు పైగా విచారించింది. అనంతరం, మోదీ, మరో 59 మందిపై 'ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్' లేదంటూ క్లోజర్ రిపోర్ట్‌లో సిట్ పేర్కొంది. దీనిపై జాఫ్రి, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ 2012 ఫిబ్రవరి 9న మెట్రో పాలిటన్ కోర్టులో సవాలు చేశారు. మోదీకి క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తమ పిటిషన్‌లో ప్రశ్నించారు. అయితే సిట్ రిపోర్ట్‌ను దిగువ కోర్టు సైతం సమర్ధించడంతో, ఆ తదుపరి క్రమంలో జాఫ్రి, సెతల్వాద్ గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. 2017 జూలై 3న కేసు విచారణ పూర్తయింది. మోదీకి, ఇతరులకు దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్ధించింది. దీనిని పైకోర్టులో సవాలు చేసుకునే వీలు జాఫ్రికి కోర్టు కల్పించింది. దీంతో జాఫ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నిబంధనలను దిగువ కోర్టులు పాటించలేదని, సాక్షులు సంతకం చేసిన స్టేట్‌మెంట్లను పరిగణనలోకి తీసుకోలేదని, ఈ ఘటనల వెనుక కుట్ర ఉందని జాఫ్రి ప్రతినిధులు ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.