ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఏపిలో మొత్తంగా గుంటూరులోనే టాప్ లో ఉంది. రాష్ట్రంలో కరోనా మరణాల్లోను తొలి స్థానంలో ఉంది. ఊహించని విధంగా కొద్ది రోజులుగా గుంటూరు జిల్లాలో ప్రధానంగా జిల్లా కేంద్రంలో పెరిగిపోతున్న కేసులు జిల్లా యంత్రాంగానికి సవాల్ గా మారుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇక్కడ కేసుల పెరుగుదలపై ఆరా తీస్తోంది. అయితే ఇంతగా కేసులు పెరగడం వెనుక వైఫల్యం ఎక్కడుంది. అధికారుల్లో సమన్వయ లోపం కనిపిస్తోంది. లాక్ డౌన్ సడలింపు సమయాల్లో గత నాలుగు రోజుల్లో జిల్లా అధికారుల నుంచి భిన్న ప్రకటనలు వచ్చాయి. రోజు విడిచి రోజు నిత్యావసరాల కోసం సడలింపు ఇస్తామనే ప్రకటనతో ఒక్కసారిగా నగర ప్రజలు రోడ్లపైకి వచ్చారు. నియంత్రణ పట్టు తప్పింది. దీంతో జిల్లా అధికారులు తిరిగి తమ నిర్ణయాన్ని మార్చు కున్నారు. ప్రతిరోజు సడలింపు ఉంటుందంటూ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇక, గుంటూరులో తొలికేసు జిల్లా కేంద్రంలో ఒక ప్రజా ప్రతినిధి బంధువు నుండి మొదలైంది.
దీన్ని అధికారులు అధికారికంగా ధ్రువీకరించే సమయానికే ఆ వ్యక్తి అనేక మందితో కాంటాక్టు అయ్యాడు. ఫలితంగా మరికొన్ని అనుమానిత కేసులు పెరిగాయి. ఇక జిల్లావ్యాప్తంగా కేసులు ఉన్నా జిల్లా కేంద్రంలో పెద్దసంఖ్యలో పెరుగు తున్న కేసులు అధికారుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. ఇప్పటికే జిల్లా ప్రత్యేకాధికారిగా ప్రభుత్వం ప్రిన్సివల్ కార్యదర్శి బి.రాజశేఖర్‌ను నియమించింది. ఇక కలెక్టర్, రూరల్, అర్బన్ ఎస్పీలు నిరం తరం సమీక్షలు చేస్తున్నారు. ప్రజలకు సూచనలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు అనేది మాత్రం సమస్యలను తెచ్చి పెడుతోంది. ముఖ్యమంత్రి నివాసం ఉండేది గుంటూరు జిల్లా లోనే. జగన్ నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే గుంటూరు నగరం ఉంది. చివరకు తాడేపల్లిలో కూడా ఒక కేసు వచ్చింది
ఇక గుంటూరు జిల్లాలో ఇప్పటికే నల్లురు కరోనా కారణంగా మరణించారు. జిల్లాలో గతంలో పనిచేసిన సీనియర్ అధికారులను, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లుగా గతంలో గుంటూరులో వనిచేసి ప్రత్యేక గుర్తింపు పొందిన టి.కృష్ణబాబు ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ లో కీలకంగా ఉన్నారు. అలాగే గుంటూరు మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రవీణ్ ప్రకాశ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నారు. వారు సిఎంఓలో ఉన్నా, గుంటూరు పై పట్టు ఉన్నా, గుంటూరులో పరిస్థితి మాత్రం అదుపులోకి రావటం లేదు. డీజీపీ ఆఫీస్ కూడా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. సియం, డీజీపీ, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు ఇక్కడే ఉంటున్నా, గుంటూరు జిల్లా పరిస్థితి మాత్రం, రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది.