ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సోమవారం ఉదయం గుంటూరులో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. టీడీపీ నేత, ఎల్వీఆర్ క్లబ్ కార్యదర్శి కోవెలమూడి రవీంద్ర ఇంట్లో తనిఖీలు చేపట్టారు. రవీంద్ర ఇల్లు, కార్యాలయంతో పాటు అతిథి గృహంలోనూ సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజామున 3 కార్లలో వచ్చిన ఐటీ అధికారులు రవీంద్రకు చెందిన పలు దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రవీంద్ర గ్యాస్, పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారు. గత పదిరోజుల క్రితం జిల్లాలోని పలువురు వ్యాపారుల ఇళ్లు, వ్యాపార సంస్థలపై సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు ఇప్పుడు ఏకంగా టీడీపీ మద్దతు దారుల కార్యాలయాలపై సోదాలు చేపట్టింది. తొలుత వ్యాపార సంస్థలపై దాడులు చేసిన అధికారులు, రెండో విడతలో టీడీపీ మద్దతుదారులు, వారి వ్యాపారసంస్థలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
సాయంత్రంలోపు మరొకొందరు టీడీపీ సానుభూతిపరుల పై ఐటీ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం, మరో మారు, పెద్ద ఎత్తున అధికారులు, అమరావతి చేరుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ సారి ముసుకులో గుద్దులాట లేకుండా, డైరెక్ట్ గా తెలుగుదేశం నాయకుల పై విరుచుకుపడనున్నట్టు తెలుస్తుంది. మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వాయించటం, మాయవతిని కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేలా చేసి, బీజేపీకి రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో దెబ్బ వెయ్యటానికి చంద్రబాబు వ్యూహం పారిన నేపధ్యంలో, మోడీ-షా, ఇక చంద్రబాబు పై డైరెక్ట్ యుద్ధం చేయ్యనున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే, ఈ రోజు రాష్ట్రంలో మరోసారి ఐటి దాడులు జరుగుతున్నాయి. ఈ సారి, డైరెక్ట్ గా తెలుగుదేశం నేతలనే టార్గెట్ చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం, పోలవరం పనులు చేస్తున్న నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్(ఎన్‌ఈసీఎల్) కార్యాలయాల్లో సోదాలు చేసారు. ఈ కంపెనీ నిర్వహిస్తున్న నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం ఓడరేవులో అధికారులు తనిఖీ చేశారు. గత ఏడాది ఈ ఓడరేవు నుంచి విదేశాలకు ఖనిజాలు, ఇతర సరకులు భారీగా ఎగుమతి అయ్యాయి. తిరుపతి నుంచి వచ్చిన ఆదాయపన్ను శాఖ సహాయ సంచాలకులతోపాటు ముగ్గురు అధికారులు ఇక్కడ పరిశీలించారు. విశాఖ ద్వారకానగర్‌లో ఉన్న నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ కార్యాలయానికి కూడా వెళ్లి ప్రాజెక్టుల రికార్డులను తనిఖీ చేశారు. తెలంగాణలోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఉన్న నవయుగ కార్యాలయంలో కూడా దాడులు జరిగాయి. అయితే అక్కడ చివరంగా ఏమన్నా దొరికాయా అనే విషయం మాత్రం ఐటి అధికారులు చెప్పకుండా వెళ్ళిపోయారు.