గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటేసినందున ఐదేళ్ల పాటు ఊరిలోకి రాకూడదని వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నారని, ఆందోళన చెందిన గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన కొంతమంది రైతులు శనివారం రూరల్ ఎస్పీ జయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో, వెంటనే తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. తమ పై దాడిన చేసిన 26 మంది పేర్లు, వివరాలు పోలీసులకు అందజేశారు. దీని పై స్పందించిన ఎస్పీ విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ ఘటన పై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకులు తమను రాళ్లు, కర్రలతో కొట్టి, ఈ ఊరిలో ఉండవద్దంటూ బెదిరించి వెళ్లగొట్టారని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు చేస్తున్న దాడులు భరించే ఓపిక మాకు లేదని, 70 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టి పొరుగునున్న గామాలపాడు గ్రామంలో తలదాచుకుంటున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. మేము వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళమని, పొలాల్లోకి వెళ్లి పని చేసుకుంటుంటే, మరో ఐదేళ్ల వరకు గ్రామంలోకి రాకూడద, మా మాట కాదని వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. బెదిరించిన వారిలో కొందరు రౌడీషీటర్లు చేరి గ్రామంలోని 20 మంది పై దాడి చేశారని చెప్పారు. పోలీసులకు దీని పై ఫిర్యాదు చేస్తే వారి పై కేసులు నమోదు చేయడం లేదని వాపోయారు. సుమారు 200 కుటుంబాలు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెప్పుకొచ్చారు.