గుంటూరు జిల్లాలో, కేసులు రోజు రోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు కొత్తగా మరో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు నగరంలో 13 మందికి, దాచేపల్లిలో ఒకరికి వైరస్ సోకినట్టు నిర్ధరించామని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ తెలిపారు. అలాగే ఇద్దరు చనిపోయారు. మొత్తంగా, తాజా కేసులతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 71కి చేరిందన్నారు. ఈ రోజు వచ్చిన కేసులలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. కరోనా సోకిన వారిలో.. ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఉన్నట్టు చెప్పారు. దీంతో కలెక్టర్ కీలక నిర్ణయం ప్రకటించారు. రేపు గుంటూరు జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్ ఉంటుందని... నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు సైతం అందుబాటులో ఉండవని కలెక్టర్ పునరుద్ఘాటించారు. రానున్న రోజుల్లో వైరస్ తీవ్రతను బట్టి రోజు విడిచి రోజే నిత్యావసరాల విక్రయం అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు గుంటూరు నగరంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూ వెళ్తుంది. మొత్తంగా, గుంటూరు నగరంలోనే 53 పాజిటివ్ కేసులున్నాయి.
రేపు ఆదివారం, చికెన్, మటన్ షాపులు కూడా ఉండవని, కలెక్టర్ చెప్పారు. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని, ప్రజలకు కావాల్సినవి అన్నీ అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ చెప్పారు. అవసరం అయితే, రేపటి నుంచి రోజు మార్చి రోజు, మాత్రమే, బయటకు వదులుతాం అని అన్నారు. ఇది ఇలా ఉంటే, గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని చల్లేందుకు అధికారులు అధునాతన సాంకేతిక పద్ధతిని పాటించారు. కేసులు నమోదైన వీధిలో అధికారులు డ్రోన్ సహాయంతో హైపో క్లోరైడ్ ద్రావణం చల్లించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఈ డ్రోన్లను రూపొందించారు. పురపాలక సంఘం కమిషనర్ హేమమాలిని, గుంటూరు అర్బన్ ఏఎస్పీ ఈశ్వర్రావు ఈ పనులను పర్యవేక్షించారు.
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నందున గుంటూరు జిల్లా పోలీసులు లాక్డౌన్ను కఠినతరం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగం కఠిన నిర్ణయం అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే నిత్యావసర సరుకులు, కూరగాయల కొనుగోలుకు ఉదయం 9 గంటల వరకే పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు నియంత్రించారు. రెడ్ జోన్ ప్రాంతాలైతే కర్ఫ్యూ వాతావరణం తలపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత ఆంక్షలతో లాక్డౌన్ను అమలు చేశారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారికి సరైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కూలీలు తీసుకెళ్తున్న వాహనాలను పట్టుకుని సీజ్ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేశారు.