గుంటూరు జిల్లా రొంపిచర్ల మండల పరిధి రామిరెడ్డిపాలెంలో సభాపతి డాక్టర్ కోడెల పేరు మీద నిర్మించిన ముఖద్వారాన్ని సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తెదేపా హయాంలో మాజీ సర్పంచి కుమ్మెత కోటిరెడ్డి ఈ ముఖద్వారాన్ని నిర్మించారు. కొందరు వ్యక్తులు పొక్లెయిన్‌తో దాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తీసుకున్న జిల్లా రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు రొంపిచర్ల ఎస్సైని వీఆర్‌కు పంపారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. విషయాన్ని అడిషనల్ ఎస్పీ వరదరాజులు విలేకరులకు వివరించారు. ఘటన స్థలాన్ని అడిషనల్ ఎస్పీ, నరసరావుపేట డీఎస్పీ పరిశీలించారు.
రైల్వే ట్రాక్ నిర్మాణ పనులకు తెచ్చిన పొక్లెయిన్‌తో ఈ ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. కొందరు బలవంతంగా పొక్లెయిన్ తీసుకెళ్లినట్లు డ్రైవర్ పోలీసులకు తెలపగా దాన్ని ఫిర్యాదుగా స్వీకరించారు. సత్తెనపల్లి మండలం గుడిపూడి ఎస్సీకాలనీ, మరొక వీధిలోని శిలాఫలకం దిమ్మె, బోర్డులనూ గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. ‘కోడెల రహదారి’ అనే బోర్డులను, రహదారి పనుల వివరాలను తెలిపే దిమ్మెలను పగులగొట్టి పక్కనే గుంతలో పడేశారు. సోమవారం రాత్రి వీటిని పగులగొట్టగా మంగళవారం ఉదయం ఆపార్టీ నాయకులు గుర్తించి వెంటనే జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ టీడీపీ నాయకులు పోలీసులను కోరారు.
గ్రామంలో వైసీపీ నాయకులు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారంటూ ముందస్తుగా నియోజక వర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ అరవింద బాబు రొంపిచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ గ్రామం లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటంతో మరలా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో గ్రామంలో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణను సస్పెండ్ చేయటంతో పాటు ఈనెల 11న విధుల్లో చేరిన ఎస్‌ఐ పఠాన్ రబ్బానీ ఖాన్‌ను వీఆర్‌కు పంపడంతో మం డలంలో కలకలం రేపింది. రూరల్ ఎస్పీ రాజ శేఖర్ బాబు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ వరదరాజులు, డీఎస్పీ రామవర్మ, రూరల్ సీఐ చినమల్లయ్య రామి రెడ్డిపాలెం గ్రామాన్ని సందర్శించారు. శిలాఫలకం, ఆర్చి, జెండా దిమ్మెలను పరిశీలించారు. ఈ సందర్బంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.