ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండగా అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతూ రాజకీయ వేడెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు కనిగిరి టీడీపీ అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తోన్నారు. ఉగ్రనరసింహారెడ్డికి చెందిన అమరావతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గుంటూరులోని ఉగ్రనరసింహారెడ్డి ఆస్పత్రిలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. టీడీపీ ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేస్తున్నారని ఇఫ్పటికే ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే.. ఈ దాడులు జరపడంలో అధికారులు రెండు ప్లాన్లను అనుసరించారని తెలుస్తోంది.
టీడీపీ నేతలపై పగ పట్టినట్టుగా ఒకేసారి అనేక మంది పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. అది రాజకీయంగా టీడీపీ ని బలహీన పరచడానికే ఇలాంటి సమయంలో అస్త్రం అవుతుందని చెప్పవచ్చు. రెండు రోజుల క్రితం కూడా మంత్రి నారయణ పై దాడులు జరిగాయి. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో ఇబ్బంది పడకుండా టీడీపీ… ఇలాంటి దాడుల విషయాన్ని ముందుగానే ఊహించింది. కర్ణాటక, తెలంగాణా ఎన్నికల సందర్భంగా ప్రత్యర్ధి వర్గాలపై జరిగిన ఐటీ దాడులను ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్దులందరినీ ఈ సందర్భంగా అప్రమత్తం చేసింది. ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచే ఐటీ దాడులు జరుగుతాయని తెలిసిపోయింది. అప్పట్లో కొంత మంది టీడీపీ ముఖ్య నేతలపై దాడులు చేశారు.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నువ్వా నేనా అనే రీతిలో పోరాడుతున్న నియోజకవర్గాలలో తెలుగుదేశం అభ్యర్దులను గుర్తించి వారిపై దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల నైతిక స్థైర్యం దెబ్బతీయవచ్చని, అత్యంత విలువైన ప్రచార సమయంలో రెండు, మూడు రోజుల పాటు అభ్యర్ది దాడుల కారణంగా ఐటీ అధికారుల ఎదుట కూర్చోవాల్సి వస్తుందని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ఆర్ధికపరమైన చికాకులతో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా నైతికంగా దెబ్బ తింటుందని, ఇటువంటి లక్ష్యాలను సాధించడం కోసమే ఐటీ దాడులను చేయించేందుకు తెకగబడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.