మొన్నటి దాక చంద్రబాబుని దించాలని, అహర్నిశలు శ్రమించిన బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్, అదే ఆశయం కోసం పని చేసి గెలిచిన జగన్ ను ఈ రోజు కలిసారు. జగన్ తో జీవీఎల్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన జీవీఎల్ జగన్ తో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, జగన్ మోహన్ రెడ్డిని శాలువా కప్పి, జీవీఎల్ సన్మానించారు. ఎన్నికల ముందు వరకు, చంద్రబాబు ప్రభుత్వం పై రోజుకి ఒక కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వచ్చి, ఏవేవో ఆరోపణలు చేసి, ప్రజలను కన్ఫ్యూజ్ చెయ్యటంలో జీవీఎల్ సక్సస్ అయ్యారు. ప్రతి రోజు, ఎదో ఒక అవినీతి ఆరోపణ చేస్తూ, చంద్రబాబు అవినీతి మాత్రమే చేస్తున్నారు అనే భ్రమ కల్పించటంలో సక్సస్ అయ్యి, జగన్ విజయానికి ఆయన తోడ్పాటు కూడా అందించారు. ఈ నేపధ్యంలో, జగన్ ని కలిసి, ఉమ్మడి శత్రువు చంద్రబాబుని ఓడించినందుకు, ఒకరినొకరు అభినందించుకున్నారు.
ఇది ఇలా ఉంటె, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను మారుస్తున్నారని, ఆ స్థానంలో సుష్మా స్వరాజ్ ను నియమిస్తారంటూ వస్తున్న వదంతులపై ఈ రోజు ఉదయం జీవీఎల్ నరసింహారావు స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా వస్తున్న ఈ వదంతులను నమ్మొద్దని, ఇప్పట్లో నరసింహన్ ను మార్చే యోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ, 2020 నాటికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలో చేరే వారిపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సేవా భావంతో పార్టీలోకి వస్తానంటే వారిని తప్పకుండా ఆహ్వానిస్తామని చెప్పారు. పార్టీలో అంతర్గత చర్చ జరిగిన తర్వాతే ఆయా పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకుంటామని వివరించారు.