ఏపీ పోలీసులపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్ర ఆరోపణలు చేశారు. మొన్నటి దాక ఈయన ఫ్రెండ్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీసుల పై ఆరోపణలు చేస్తే, ఇప్పుడు జీవీఎల్ మొదలు పెట్టారు. రాష్ట్ర పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులని టిడిపి కార్యకర్తలు అంటూ, దిగజారుడు వ్యాఖ్యలు సెహ్సారు. ఏపీలో ఓట్ల తొలగింపుపై ఈసీకి ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం జీవీఎల్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలకు తెలుగుదేశం తూట్లు పొడుస్తోందని మండిపడ్డారు. ఫామ్-7ను ఎవరైనా దరఖాస్తు చేయొచ్చన్నారు. అది నిజమైందో... కాదో ఎన్నికల సంఘం తేల్చుతుందని చెప్పారు.
టీడీపీకి వ్యతిరేక ఓట్లు తొలగించడంపై ఈసీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆధార్, ఓటర్ డేటాను ఏపీ ప్రభుత్వం దొంగిలించి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు. మరో పక్క, ఆంధ్రప్రదేశ్ డీజీపీని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఏపీ బీజేపీ నేతలు కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం కన్నా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనివారి ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని సీఈసీని కోరినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మతిస్థిమితం సరిగా లేదని కన్నా వ్యాఖ్యానించారు.