ఎన్డీఏకి గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేత జీవీఎల్ జోస్యం చెప్పారు. త్వరలో సైకిల్ పూర్తిగా కనుమరుగు కావడం ఖాయమని జీవీఎల్ జోస్యం చెప్పారు. టీడీపీలో కొంతమంది రాజకీయ బ్రోకర్లు తయారయ్యారని, నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్నారని జీవీఎల్ అన్నారు. చంద్రబాబు, రాహుల్, మమతకి ఓటమి భయం పట్టుకుందని, రాహుల్ అందుకే రెండు స్థానాల నుంచి పోటీచేస్తున్నారని జీవీఎల్ విమర్శించారు. చంద్రబాబును ప్రజలు పట్టించుకోకపోవడంతో జాతీయ నేతలను తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్ ఆక్షేపించారు. కేంద్ర పథకాలను బాబు తన పథకాలుగా చెప్పుకుంటున్నారని, కియా వ్యవహారంలో అన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తే.. తానే తెచ్చానని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని జీవీఎల్ తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీకు మిత్రుడా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా జీవీఎల్ నర్సింహారావు అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లాలో జీవీఎల్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. సీఎం చంద్రబాబు, టీడీపీ సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు పోలవరం సొమ్మువరం అని వ్యాఖ్యానించారు. కాంట్రాక్టర్లకు 1800కోట్లు అదనంగా చెల్లించి కమీషన్ జేబులో వేసుకున్నారని ఆరోపించారు. భారత్‌కు కియా రావడం వెనుక మోదీ పాత్ర ఉంటే ఏపీకి రావడంలో చంద్రబాబు పాత్ర ఎంతో కొంత ఉంది అని జీవీఎల్ చెప్పుకొచ్చారు.
పవన్ గురించి మాట్లాడిన ఆయన.. జనసేన పేరు కులసేనగా మార్చుకోవాలన్నారు. కాపు ఓట్లు ఎక్కువ ఉన్నచోటే పవన్ పోటీచేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్‌గా మారిపోయారని, పవన్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా నటిస్తున్నారని, నాటకాలకు పవన్ పుల్‌స్టాప్ పెడితే మంచిదని జీవీఎల్ సూచించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయాయని అన్నారు. అయితే ఎంతసేపూ ఆయన టీడీపీ, జనసేన గురించే మాట్లాడటమే కాకుండా విమర్శలు గుప్పించారు కానీ వైసీపీ గురించి మాట్లాడకపోవడం గమనార్హం.