రైల్వే జోన్ విషయంలో టీడీపీ కేంద్రం పై పోరాటం ఉదృతం చేసింది. కేంద్రం స్పందించక పోవడంతో పార్లమెంట్ సభ్యులతో కలిసి పోరాటం చేయాలని నిన్న ఢిల్లి వెళ్లారు. ప్రజలందరూ పోరాటానికి సిద్ధమయ్యారని, రైల్వే జోన్ ఇవ్వాల్సిందే అంటూ, రైల్వే మంత్రికి వివరించడానికి ఢిల్లీ వెళ్లారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ 6 గంటలకు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యాక టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి రైల్వే భవన్‌కు చేరుకున్నారు. 8 గంటల వరకూ వేచి చూసినా రైల్వే మంత్రి రైల్ భవన్‌కు చేరుకోలేదు. ఇచ్చిన అపాయింట్‌మెంట్‌కు రెండు గంటల తర్వాత పీయూష్ గోయల్ అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే తీవ్ర నిరుత్సాహం, అసంతృప్తితో ఉన్న ఎంపీలు, నాయకులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పీయూష్ గోయల్‌తో పాటు అక్కడే ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఈ వ్యవహారంలో కలుగజేసుకున్నారు. జోన్ వరకూ తాను సమర్థిస్తున్నానని, కానీ వెనుకబడిన జిల్లాల నిధుల విడుదల, వెనక్కి తీసుకవడంపై చేస్తున్న ఆరోపణలు మాత్రం తప్పు అంటూ జీవీఎల్ చెప్పుకొచ్చారు. అప్పటికే జీవీఎల్ వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న టీడీపీ ఎంపీలు, ఉత్తరాంధ్ర నాయకులు ఒక్కసారిగా ఆయనపై విరుచుకు పడ్డారు.
రైల్వే మంత్రిని తమ సమస్యల గురించి అడుగుతుంటే, మధ్యలో మీకేం సంబంధమంటూ జీవీఎల్‌ఎన్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఏం జరుగుతోందో తెలియని అయోమయ స్థితిలో ఉన్న మంత్రి పీయూష్ గోయల్ తన సీటులో నుంచి లేచి నిలబడ్డారు. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కలుగజేసుకుని వారిని శాంతిపజేశారు. ‘‘ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వరు’’ అని కళా వెంకట్రావు పేర్కొనగా... ‘ను వ్వేం చేస్తావ్’ అని జీవీఎల్ ప్రశ్నించారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. ‘యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో ఏం సంబంధం?’ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
మాటామాటా పెరగడంతో విశాఖ ఈస్ట్ ఎమ్మల్యే వెలగపూడి రామకృష్ణకు, జీవీఎల్ కు తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఒకానొక దశలో, వెలగపూడి రామకృష్ణ, జీవీఎల్ మీదకు దూసుకొచ్చారు. అక్కడ ఉన్న అశోక్ గజపతి రాజు, ఆపకపోయి ఉంటే, జీవీఎల్ పై దెబ్బలు కూడా పడేవని అంటున్నారు. చివరికి జీవీఎల్, హరిబాబును పీయూష్ అక్క డి నుంచి తన కార్యాలయంలోకి తీసుకెళ్లారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. గోయల్, జీవీఎల్ వైఖరికి నిరసనగా టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రైల్ భవన్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. టీడీపీ నేతలకు సమయం కేటాయించేందుకు పీయూష్ రోజంతా మొరాయించారు. చివరికి సమయం కేటాయించినా... రెండుగంటలు నిరీక్షించేలా చేశారు.