ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాఫెల్ ఒప్పందం రగడతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) పేరు అందరి నోళ్లలో నానుతోంది. హాల్ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ దాన్ని పక్కనబెట్టి, అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ కు మోడీ సర్కార్ కావాలనే కాంట్రాక్టును అప్పగించిందని గత కొంతకాలంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ రఫేల్ అంశాన్ని ప్రధాన అస్త్రంగా మలచుకోని రోజుకో బాంబు పేలుస్తున్నారు. ఈ ఒప్పందం పై ఫ్రాన్స్ మాజీ అధ్య క్షుడు ఫ్రాన్సో హోలన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. మరోవైపు 'హాల్ కు సామర్థ్యం లేకపోవడం వల్లే కాంట్రాక్టును ఇవ్వలేదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.
దీంతో కంపెనీ సామర్థ్యం పై అనుమానాలు రేకెత్తిన వేళ, హాల్ రికార్డు స్థాయిలో అత్యధిక టర్నోవర్ సాధించడం విశేషం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 2017-18 సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.18,283.86 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్టు చెప్పారు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.17,603.79 కోట్లుగా నమోదైనట్టు తెలిపారు. శుక్రవారంనాడు కంపెనీ 55వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. కంపెనీ లిస్టింగ్ తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. గత ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపునకు ముందు లాభం రూ.3,322.84 కోట్లుగా ఉందని, నికర లాభం రూ.2,070.41 కోట్లుగా నమోదైందని మాధవన్ తెలిపారు.
తమ కంపెనీ 105 కొత్త ఇంజన్లను ఉత్పత్తి చేసిందని, 220 విమానాలు, హెలికాప్టర్లు, 550 ఇంజన్లను ఓవర్‌హాల్ చేసినట్టు ఆయన చెప్పారు. అంతరిక్ష ప్రోగ్రామ్‌కు సంబంధించి 146 కొత్త ఏరో స్ట్రక్చర్స్‌ను ఉత్పత్తి చేసినట్టు కూడా ఆయన తెలిపారు. తమ కంపెనీ 40 విమానాలు, హెలికాప్టర్లను ఉత్పత్తి చేసినట్టు చెప్పారు. వీటిలో ఎస్యు-30 ఎంకెఐ, ఎల్‌సిఎ తేజస్ కూడా ఉన్నాయని తెలిపారు. రాఫెల్ విమానాలను ఉత్పత్తి చేసే సామర్థ్యం హెచ్ఎఎల్కు లేదన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కంపెనీ చైర్మన్ తమ కంపెనీకున్న సామర్థ్యాలను వాటాదారుల ముందు ప్రకటించారు. రాఫెల్ వివాదం పై ఇటీవల రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. యూపీఏ హయాంలో రాఫెల్ ఒప్పందం జరగకపోవడానికి ‘హాల్'కు సామర్థ్యం లేకపోవడం కూడా ఒక కారణమేనని అన్నారు. మరోవైపు రాఫెల్ ఒప్పందం కోసం రిలయన్స్ డిఫెన్స్ పేరును మోదీ సర్కారే ప్రతిపాదించిందని ఇటీవల ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్తా రాజకీయ వివాదానికి దారితీసింది.