ప్రపంచస్థాయి సంతోషకరమైన నగరాలకు చుక్కానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న చంద్రబాబు సంకల్పం నెరవేరనుంది. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాలను ఆ దిశగా అభివృద్ధి చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో, సీఐఐ సౌజన్యంతో నిర్వహించనున్న సంతోష నగరాల సదస్సుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ-గుంటూరుల మధ్య, మంగళగిరికి సమీపంలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న ఈ హ్యాపీ సిటీస్ సమ్మిట్‌కు 15 దేశాల నుంచి సుమారు వెయ్యి మంది నిష్ణాతులు హాజరై, ప్రజల్లో సంతోష స్థాయిలను పెంచేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలపై మేధోమథనం సాగించనున్నారు.
ఈ సదస్సుకు అమెరికా, ఇంగ్లండ్, స్పెయిన్, జపాన్, సింగపూర్, భూటాన్, ఫిన్లాండ్, యూఏఈ, కోస్టారికా, కొలంబియా, టాంజానియా, ఇజ్రాయెల్ సహా 15 దేశాలకు చెందిన 100 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో సహా మొత్తం వెయ్యిమంది హాజరుకానున్నారు. దాల్‌బర్గ్, సీఐఐ, సింగపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ సంస్థలు ఈ సదస్సులో భాగస్వామ్యం వహిస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో సంతోషానికి పేరొందిన ఫిన్‌ల్యాండ్ నుంచి పీటర్ ఆఫ్ యాంగ్రీబర్డ్స్ ఫేమ్ నేతృత్వంలో ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం రానుంది. సీఎం చంద్రబాబు, సద్గురు జగ్గీ వాసుదేవ్ సంయుక్త నిర్వహణలో హ్యాపీనెస్ పై ప్రత్యేక చర్చ జరగనుంది.
రైతుల భాగాస్వామ్యంతో భూసమీకరణ, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, గణనీయమైన బ్లూ, గ్రీన్ సిటీ, వందల కిలోమీటర్ల సైకిల్ ట్రాక్‌లు నగర ప్రణాళికలో ఇమిడి ఉంటాయి. వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులు తమ ప్రాంతాల్లో ఆనందం కోసం అవలంభిస్తున్న విధానాలను, వ్యూ హాలను పంచు కొంటారు. ఆర్కిటెక్చర్, ప్లానింగ్ విద్యార్థులకు ఈ సదస్సు ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. సిటీల్లో హ్యాపీనె్‌సను కొలిచే విధివిధానాలకు సంబంధించిన నియమావళిని రూపొందించే కార్యస్థలంగా ఈ సదస్సు నిలవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంతోషంతో విలసిల్లే నగరాల అభివృద్ధికి విధానపరమైన మార్గదర్శక సూత్రాలు, నియమ నిబంధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, డిక్లరేషన్‌కు వేదికగా ఇది నిలవనుంది.