బీజేపీ ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర బీజేపీలో ఒకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తుతుండగా... హరిబాబు సంయమనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరిని పారీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక దశలో గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడు... పార్టీ కోరినందునే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారా, లేక తనంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవి ఇవ్వనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన అధ్యక్ష పదవి స్వీకరిస్తారని ప్రచారం సాగింది. అధిష్టానం అధికారికంగా ప్రకటించడమే ఇక ఆలస్యం అని వార్తలు వచ్చాయి. అందుకే హరిబాబు చేత రాజీనామా చేయించారా? లేదా తనకు తానుగా ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో పోరు పడలేక రాజీనామా చేశారా? లేదా ప్రస్తుతం ఎలాగో ఎంపీ పదవి ఉంది గనుక ఈ కొద్ది రోజులు పార్టీలోనే ఉండి అనంతరం బీజేపీకి రాజీనామా చేసేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారానే యోచనలో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చేసిన తర్వాత బీజేపీ నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ దుమ్మెత్తి పోసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఇప్పటికీ కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు.. టీడీపీకి వత్తాసు పలకడంతో ఆ మధ్య పార్టీ నేతల మధ్య చిన్నపాటి గొడవలు జరిగి మీడియాకెక్కారు. అప్పట్నుంచి హరిబాబు కాస్త అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ నేతల విమర్శలు తిప్పికొట్టడంలో ప్రస్తుతమున్న అధ్యక్షుడు విఫలమయ్యారని అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలను తిప్పి కొట్టడంలో ముందు వరుసలో ఉన్నారని అందుకే సోముకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.