దివంగత నేత హరికృష్ణ అంతిమయాత్ర మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివ దేహం బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు. ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడె పట్టుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, కుటుంబ సభ్యులు అశ్రునయనాలతో ముందు నడిచారు. 'హరికృష్ణ అమర్ రహే' అంటూ అభిమానులు నినాదాలు చేశారు. హరికృష్ణ భౌతికకాయాన్ని అక్కడి నుంచి వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు పది కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.
హరికృష్ణ అంతిమయాత్రకు రెండు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. తమ అభిమాన నటుడు, నాయకుడిని కడసారి చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు హరికృష్ణ నివాసానికి తరలివచ్చారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది అభిమానులు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా... అంతిమయాత్రలో తొక్కిసలాట జరుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. వందలాది మంది పోలీసులతో ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.